Jammu and Kashmir: జమ్మూకశ్మీర్‌లో మళ్లీ పౌరులే లక్ష్యంగా హత్యలు.. నాలుగు రోజుల్లో ముగ్గురి మృతి

కశ్మీర్‌ లోయలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. మైనార్టీలు, వలసకూలీలను లక్ష్యంగా చేసుకుని హత్యలకు పాల్పడుతున్నారు.

Updated : 18 Oct 2022 15:05 IST

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో మరోసారి మైనార్టీలు, వలస కూలీలను లక్ష్యంగా చేసుకుని హత్యలు జరుగుతుండటం కలకలం రేపుతోంది. మొన్నటికి మొన్న ఓ కశ్మీరీ పండిట్‌ను ఉగ్రవాదులు కాల్చి చంపగా.. తాజాగా మరో ఇద్దరు వలసకూలీలు ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయారు. షోపియాన్‌ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది.

షోపియాన్‌లోని హర్మెన్‌ ప్రాంతంలో వలసకూలీలు నివసిస్తున్న ఇంటిపైకి ఉగ్రవాదులు గ్రనేడ్‌ విసిరారు. ఈ ఘటనలో ఇద్దరు కూలీలు తీవ్రంగా గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వారు ప్రాణాలు కోల్పోయారు. మృతులను ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌కు చెందిన రామ్‌సాగర్‌, మోనిశ్‌ కుమార్‌గా పోలీసులు గుర్తించారు.

ఘటన తర్వాత హర్మెన్‌ ప్రాంతంలో పోలీసులు కార్డెన్‌ సెర్చ్‌ చేపట్టి ముష్కరుల కోసం గాలించారు. ఈ సోదాల్లో లష్కరే తోయిబాకు చెందిన హైబ్రిడ్‌ ఉగ్రవాది ఇమ్రాన్‌ బషీర్‌ గనీని పోలీసులు అరెస్టు చేశారు. కూలీలపైకి గ్రనేడ్‌ విసిరింది ఇమ్రానే అని తేలింది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో తనిఖీలు కొనసాగుతున్నాయని జమ్మూకశ్మీర్‌ అదనపు డీజీపీ విజయ్‌ కుమార్‌ వెల్లడించారు.

గత శనివారం ఇదే షోపియాన్‌ ప్రాంతంలో ఓ కశ్మీరీ పండిట్‌ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. చౌధరీ గూండ్‌ గ్రామంలో పూర్ణ కృష్ణ భట్‌ తన పూర్వీకుల నివాసం వద్ద ఉండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన భట్‌.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ దాడిని తామే చేసినట్లు కశ్మీర్‌ ఫ్రీడమ్‌ ఫైటర్స్‌ ప్రకటించింది. భట్‌ హత్యతో కశ్మీర్‌ లోయలో మరోసారి ఆందోళనలు మొదలయ్యాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు