Kuno Park: చీతా కూన మృతి.. రెండు నెలల్లో నాలుగో ఘటన!

నమీబియా నుంచి తీసుకొచ్చిన ఓ ఆడ చీతాకు పుట్టిన నాలుగు కూనల్లో ఒకటి నేడు మృత్యువాతపడింది. కునో జాతీయ పార్కులో రెండు నెలల వ్యవధిలో ఇది నాలుగో చీతా మరణం కావడం గమనార్హం.

Published : 23 May 2023 21:29 IST

భోపాల్‌: మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లోని కునో జాతీయ పార్కు (Kuno National Park)లో చీతాల మరణాలు ఆగడం లేదు! నమీబియా (Namibia), దక్షిణాఫ్రికా (South Africa)ల నుంచి తీసుకొచ్చిన ఈ చీతా (Cheetahs)ల్లో ఇప్పటికే మూడు మరణించగా.. తాజాగా రెండు నెలల చీతా కూన (Cheetah Cub) మృత్యువాతపడింది. బలహీనంగా ఉన్న కారణంగానే అది మృతి చెంది ఉంటుందని ప్రాథమికంగా అనుమానిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు.

‘నమీబియా నుంచి తీసుకొచ్చిన ‘జ్వాల’ అనే చీతాకు రెండు నెలల క్రితం నాలుగు పిల్లలు పుట్టాయి. మంగళవారం వాటిలో మూడు తల్లితో కలిసి తిరుగుతుండగా.. ఒకటి మాత్రం అక్కడే పడి ఉన్నట్లు పర్యవేక్షణ బృందం గుర్తించింది. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన పశువైద్యులు దానికి అవసరమైన చికిత్స అందించారు. కానీ, ఫలితం లేకపోయింది’ అని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. పుట్టినప్పటి నుంచి ఆ కూన బలహీనంగానే ఉందని, మరణానికి కారణం కూడా అదే అయి ఉంటుందని పేర్కొన్నారు. పోస్టుమార్టం అనంతరం పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్పారు.

ఇదిలా ఉండగా.. దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన చీతాల్లో ఒకటైన ఆడ చీతా ‘దక్ష’ సరిగ్గా రెండు వారాల క్రితం మృతి చెందింది. అంతకుముందు నమీబియా నుంచి తీసుకొచ్చిన సాశా అనే ఆడ చీతా మార్చి 27న, దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన ఉదయ్‌ అనే మగ చీతా ఏప్రిల్‌ 23న మృత్యువాతపడ్డాయి. ‘ప్రాజెక్ట్ చీతా’లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రెండు విడతల్లో నమీబియా, దక్షిణాఫ్రికాల నుంచి 20 చీతాలను భారత్‌కు తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని