Kuno Park: ఆగని చీతాల మరణాలు.. మరో రెండు కూనలు మృతి!

కునో జాతీయ పార్కులో మరో చీతా కూనలు మృతి చెందాయి. ‘జ్వాల’ అనే చీతాకు రెండు నెలల క్రితం నాలుగు పిల్లలు పుట్టగా.. మంగళవారం ఒకటి చనిపోయింది. రెండు రోజుల వ్యవధిలోనే నేడు మరో రెండు మృత్యువాతపడ్డాయి.

Published : 25 May 2023 18:18 IST

భోపాల్‌: మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లోని కునో జాతీయ పార్కు (Kuno National Park)లో చీతాల వరుస మరణాలు కలవరపరుస్తున్నాయి. మంగళవారమే ఓ చీతా కూన మృత్యువాత పడగా.. రెండు రోజుల వ్యవధిలోనే తాజాగా మరో రెండు చీతా కూన (Cheetah Cubs)లు చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, డీహైడ్రేషన్‌ కారణంగానే అవి మృతి చెందినట్లు తెలిపారు. నమీబియా (Namibia), దక్షిణాఫ్రికా (South Africa)ల నుంచి తీసుకొచ్చిన చీతా (Cheetahs)ల్లో ఇప్పటికే మూడు మరణించగా.. తాజా ఘటనల్లో మూడు చీతా కూనలు మృత్యువాతడ్డాయి.

‘నమీబియా నుంచి తీసుకొచ్చిన ‘జ్వాల’ అనే చీతాకు రెండు నెలల క్రితం నాలుగు పిల్లలు పుట్టాయి. అయితే, ఇటీవల కునో జాతీయ పార్కు ప్రాంతంలో రికార్డు స్థాయిలో 46-47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ప్రతికూల పరిస్థితుల కారణంగా చీతా కూనలు నీరసించిపోయినట్లు పర్యవేక్షకులు గుర్తించారు. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన పశువైద్యులు వాటికి అవసరమైన చికిత్స అందించారు. పరిస్థితి విషమించి.. ఒకటి మంగళవారం చనిపోగా, తాజాగా మరో రెండు మృత్యువాతపడ్డాయి. నాలుగో పిల్ల ఆరోగ్యం నిలకడగానే ఉంది. దానికీ చికిత్స కొనసాగుతోంది’ అని అధికారులు తెలిపారు. అయితే, ఈ రెండు పిల్లలూ అదే రోజు మృతి చెందినట్లు సమాచారం.

ఇదిలా ఉండగా.. ‘ప్రాజెక్ట్ చీతా’లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రెండు విడతల్లో నమీబియా, దక్షిణాఫ్రికాల నుంచి 20 చీతాలను భారత్‌కు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన చీతాల్లో ఒకటైన ఆడ చీతా ‘దక్ష’ ఈ నెల 9న మృతి చెందింది. అంతకుముందు నమీబియా నుంచి తీసుకొచ్చిన సాశా అనే ఆడ చీతా మార్చి 27న, దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన ఉదయ్‌ అనే మగ చీతా ఏప్రిల్‌ 23న మృత్యువాతపడ్డాయి. తాజాగా ‘జ్వాల’ అనే చీతాకు పుట్టిన నాలుగు కూనల్లో మూడు చనిపోయాయి. దీంతో 2 నెలల వ్యవధిలో మూడు చీతాలు, మూడు కూనలతో కలిపి మొత్తం చీతాల మరణాల సంఖ్య ఆరుకు చేరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని