
Jammu and Kashmir: స్కూల్లోకి చొరబడి ఉగ్రవాదుల కాల్పులు.. ప్రిన్సిపల్, టీచర్ దారుణ హత్య
5 రోజుల్లో ఏడుగురు పౌరులను చంపిన ఉగ్రవాదులు
శ్రీనగర్: కశ్మీర్ లోయలో అలజడి సృష్టించేందుకు ముష్కరులు కొత్త పంథాను అనుసరిస్తున్నారు. సామాన్యులను లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడుతున్నారు. తాజాగా ఓ ప్రభుత్వ పాఠశాలలోకి చొరబడిన ఉగ్రవాదులు.. అక్కడి ప్రిన్సిపల్, టీచర్‌ను అతి దారుణంగా కాల్చి చంపారు. ఇటీవల వేర్వేరు ఘటనల్లో ముగ్గురు పౌరులను హత్యచేసిన 48 గంటల్లోపే తాజా ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. కాగా.. గత ఐదు రోజుల్లో ఏడుగురు పౌరులను ముష్కరులు పొట్టనబెట్టుకున్నారు.
గురువారం ఉదయం 11.15 గంటల ప్రాంతంలో శ్రీనగర్ శివారులోని సంగమ్ ఈద్గా ప్రభుత్వ పాఠశాలలోకి ఉగ్రవాదులు చొరబడ్డారు. స్కూల్ ప్రిన్సిపల్ సుపుందర్ కౌర్, ఉపాధ్యాయుడు దీపక్ చంద్‌పై కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన ప్రిన్సిపల్, టీచర్‌ను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారమందుకున్న పోలీసులు, భద్రతాసిబ్బంది ఈ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ చేపట్టారు. ముష్కరుల కోసం ముమ్మర గాలిస్తున్నారు. కాగా.. మృతుల్లో ఒకరైన దీపక్ చంద్ కశ్మీరీ పండిట్.
రెండు రోజుల క్రితం కూడా శ్రీనగర్‌లో ఉగ్రవాదులు ఇలాంటి దాడులకు పాల్పడ్డారు. ప్రముఖ కశ్మీరీ పండిట్, ముఖన్‌లాల్ బింద్రూ ఫార్మసీ యజమాని బింద్రూ.. స్థానిక ఇక్బాల్ పార్క్ వద్ద ఉన్న ఫార్మసీలో మందులను పంపిణీ చేస్తుండగా ముష్కరులు ఆయన దుకాణంపై దాడికి తెగబడి పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్చారు. ఆ తర్వాత మరో గంట వ్యవధిలో హవల్ ప్రాంతంలో పానీపూరి విక్రయిస్తున్న స్థానికేతరుడైన వీధి వర్తకుడు వీరేందర్‌ను ముష్కరులు కాల్చి చంపారు. రెండో దాడి జరిగిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే బాందీపుర జిల్లాలో ఉగ్రవాదులు మూడోదాడికి పాల్పడ్డారు. నయిద్‌ఖాయ్ ప్రాంతంలో స్థానిక ట్యాక్సీ స్టాండ్ అధ్యక్షుడైన మహమ్మద్ షఫీ లోనెను కాల్చిచంపారు.
ఘటనపై జమ్మూకశ్మీర్ డీజీపీ దిల్‌బాగ్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయి. వీటి ద్వారా కశ్మీరీ ప్రజల్లో భయాన్ని వ్యాప్తి చేయాలని ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారు. మతాలకు అతీతంగా ఉన్న సౌభ్రాతృత్వాన్ని దెబ్బతీయాలని భావిస్తున్నారు. పాకిస్థానీ ఉగ్రముఠాల ప్రోద్బలంతోనే ఈ దాడులకు తెగబడుతున్నారు. దీన్ని మేం తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఉగ్రవాదులను తప్పకుండా మట్టుబెడతాం’’ అని తెలిపారు.