Ukraine Crisis: దిల్లీ చేరుకున్న 28మంది తెలుగు రాష్ట్రాల విద్యార్థులు

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అక్కడ ఉన్న విద్యార్థులను స్వదేశానికి రప్పించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి.

Updated : 27 Feb 2022 12:35 IST

దిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అక్కడ ఉన్న విద్యార్థులను స్వదేశానికి రప్పించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఉక్రెయిన్‌ నుంచి ఇప్పటికే బుకారెస్ట్‌ (రొమేనియా) చేరుకున్న వారిలో కొంతమందిని భారత్‌కు తీసుకొచ్చారు. వీరిలో 17 మంది తెలంగాణ విద్యార్థులు ఈ తెల్లవారుజామున దిల్లీకి చేరుకున్నారు. ఉక్రెయిన్‌ నుంచి వచ్చిన వారిని ఉచితంగా తీసుకురావాలని సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో దిల్లీలోని తెలంగాణ అధికారులు విద్యార్థులను తెలంగాణ భవన్‌కు తీసుకెళ్లారు. ఈ సాయంత్రం కల్లా వారిని తెలంగాణకు తీసుకురానున్నారు. మరోవైపు ఏపీకి చెందిన 11 మంది విద్యార్థులు కూడా ఈ ఉదయం ఉక్రెయిన్ నుంచి దిల్లీకి చేరుకున్నారు. వారిని అధికారులు ఏపీ భవన్‌కు తీసుకెళ్లారు. ఏపీ భవన్‌లో ఉన్న 11 మంది విద్యార్థుల్లో ఉదయం 9 గంటలకు ముగ్గురు బెంగళూరుకు (కడప విద్యార్థినులు), మధ్యాహ్నం 12గంటలకు ఐదుగురు విజయవాడకు, సాయంత్రం 6గంటలకు ముగ్గురు విద్యార్థులు విశాఖకు చేరుకోనున్నట్లు ఏపీ భవన్‌ అధికారులు వెల్లడించారు.

శంషాబాద్‌ విమానాశ్రయానికి 20 మంది విద్యార్థులు

ఉక్రెయిన్‌ నుంచి నిన్న రాత్రి తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు 20మంది ముంబయికి చేరుకున్న విషయం తెలిసిందే. వారు అక్కడి నుంచి ఈ ఉదయం శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ భారత ఎంబసీ సాయంతో క్షేమంగా చేరుకోగలిగామన్నారు. క్షేమంగా తిరిగి వచ్చినందుకు సంతోషంగా ఉందని చెప్పారు.

దిల్లీ విమానాశ్రయంలో హెల్ప్‌ డెస్క్‌..

ఉక్రెయిన్‌ నుంచి వచ్చే తెలంగాణ వాసులు, విద్యార్థుల కోసం దిల్లీ విమానాశ్రయంలో హెల్ప్‌ డెస్క్‌ను ఏర్పాటు చేశారు. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్‌-3 వద్ద ఏర్పాటు చేసిన డెస్క్‌.. విద్యార్థులకు సహాయసహకారాలు అందిస్తోంది. ఈ డెస్క్‌ ద్వారా విద్యార్థులకు సౌకర్యాలు కల్పించడంతో పాటు వారిని రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు తెలంగాణ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని