
UAE: ఇక యూఏఈలో నాలుగున్నర రోజులే పనిదినాలు..!
వారాంతపు సెలవుదినాల్లో మార్పులు చేస్తూ ప్రకటన
ఇంటర్నెట్డెస్క్: ది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ మార్కెట్లతో మరింతగా అనుసంధానమయ్యేలా ఇప్పటికే ఉన్న శని, ఆదివారాల్లో సెలవులతో పాటు శుక్రవారం కూడా ఒకపూట సెలవు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆ దేశ అధికారిక మీడియా డబ్ల్యూఏఎం వెల్లడించింది. దీంతో మొత్తం నాలుగున్నర రోజులు మాత్రమే పనిదినాలు ఉంటాయని పేర్కొంది. ఈ నిర్ణయం వచ్చే ఏడాది ప్రారంభం నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించింది.
ప్రస్తుతం యూఏఈలో శుక్రవారం, శనివారం సెలవు దినాలుగా ఉన్నాయి. కానీ 2022జనవరి 1వ తేదీ నుంచి వారాంతపు సెలవులు శుక్రవారం మధ్యాహ్నం నుంచి ప్రారంభమవుతాయి. మధ్యాహ్నం 12 గంటలకు మొదలై ఆదివారం ముగిసే వరకు కొనసాగుతాయి. యూఏఈ ఆర్థిక వ్యవస్థను సౌదీకి పోటీగా మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు విదేశీ పెట్టుబడులను, ప్రతిభావంతులను ఆకర్షించేందుకు ఇప్పటికే గతేడాది పలు నిర్ణయాలు తీసుకొంది.
తాజా నిర్ణయంపై యూఏఈ ప్రభుత్వం స్పందిస్తూ ‘‘శని, ఆదివారం సెలవుగా పాటించే దేశాలతో ఆర్థిక లావాదేవీలు సజావుగా జరిగేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకొన్నాము. ఈ నిర్ణయంతో దేశంలో పనిచేసే వేలకొద్దీ అంతర్జాతీయ కంపెనీల లావాదేవీలు మరింత సరళంగా జరుగుతాయి’’ అని పేర్కొంది. పని-జీవితం మధ్య సమతౌల్యాన్ని ఈ నిర్ణయం మరింత పెంచుతుందని పేర్కొంది. ఈ నిర్ణయంతో నాలుగున్నర రోజుల పనిదినాలు కల్పించే తొలి దేశంగా యూఏఈ నిలవనుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.