లాక్‌డౌన్‌ వైపే ఉద్ధవ్‌ మొగ్గు! 

రాష్ట్రంలో కొవిడ్ విలయతాండవం చేస్తున్న వేళ మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌ ఠాక్రే అధ్యక్షతన నిర్వహించిన అఖిలపక్ష సమావేశం ముగిసింది. వీడియో కాన్ఫరెన్స్‌....

Updated : 10 Apr 2021 21:10 IST

ముంబయి: రాష్ట్రంలో కొవిడ్ విలయ తాండవం చేస్తున్న వేళ మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌ ఠాక్రే అధ్యక్షతన నిర్వహించిన అఖిలపక్ష సమావేశం ముగిసింది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై సమీక్షించారు. లాక్‌డౌన్‌ విషయంలో ప్రభుత్వం, అఖిలపక్ష నేతల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్టు సమాచారం. పూర్తి లాక్‌డౌన్‌ వైపే సీఎం ఉద్ధవ్‌ మొగ్గు చూపగా.. మరోసారి లాక్‌డౌన్‌ విధించాలన్న అభిప్రాయాన్ని మాజీ సీఎం, ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడణవీస్‌ వ్యతిరేకించినట్టు తెలుస్తోంది. దీంతో మరో 2 రోజుల పాటు పరిస్థితిని క్షుణ్నంగా పరిశీలించాలని సీఎం నిర్ణయించారు. ఈ పరిణామాల నేపథ్యంలో మరో రెండు రోజుల తర్వాత మహారాష్ట్రలో లాక్‌డౌన్‌ విధించే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. 

కొన్ని రోజుల పాటు లాక్‌డౌన్‌ అవసరమేనని మంత్రి అశోక్‌ చవాన్‌ అన్నారు. స్టేట్‌ కొవిడ్ టాస్క్‌ఫోర్స్‌తో సీఎం ఆదివారం సమావేశమవుతారన్నారు. లాక్‌డౌన్‌ విధిస్తే ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతుందని మాజీ సీఎం, భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్‌ అభిప్రాయపడ్డారు. చాలా వ్యాపారాలు మూతపడతాయని.. ఆలోచించాలని ఆయన సూచించినట్టు తెలుస్తోంది. అలాగే, లాక్‌డౌన్‌కు భాజపా వ్యతిరేకం కాదని, కానీ దీనిపై ముందుకెళ్లే ముందు సరైన ప్రణాళిక అవసరం అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్‌ పాటిల్‌ అన్నారు. 

దేశంలో నమోదవుతున్న మొత్తం కొవిడ్ కేసుల్లో దాదాపు సగానికిపైగా మహారాష్ట్రలోనే నమోదవుతున్న విషయం తెలిసిందే. నిన్న ఒక్కరోజే ఇక్కడ దాదాపు 59వేల కొత్త కేసులు, 301 మరణాలు వెలుగుచూశాయి. కొవిడ్ కట్టడికి ఇప్పటికే రాత్రిపూట కర్ఫ్యూలు, వీకెండ్‌ లాక్‌డౌన్‌ వంటి కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నా వైరస్‌ ఉద్ధృతి ఆగడంలేదు. నిన్న రాత్రి నుంచి ముంబయిలో ప్రారంభమైన వీకెండ్ లాక్‌డౌన్‌ సోమవారం ఉదయం 7గంటల వరకు కొనసాగనుంది. ఫుడ్‌ హోం డెలివరీ, అత్యవసర సేవలు, పరీక్షలు రాసేందుకు విద్యార్థులకు మాత్రమే అనుమతిస్తున్నారు. ఈ వీకెండ్‌ లాక్‌డౌన్‌తో ఛత్రపతి శివాజీ టెర్మినస్‌, బీఎంసీ ప్రధాన కార్యాలయం తదితర చోట్ల ప్రధాన రహదారులన్నీ జన సంచారంలేక వెలవెలబోయాయి.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని