Maharashtra: ‘మహా’ సీఎం ఠాక్రే బావమరిది కార్యాలయంపై ఈడీ దాడులు

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రే బంధువు కార్యాలయాలపై ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ (ఈడీ) మంగళవారం దాడులు చేపట్టింది......

Published : 23 Mar 2022 01:31 IST

ముంబయి: మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన చీఫ్‌ ఉద్ధవ్​ ఠాక్రే బంధువు కార్యాలయాలపై ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ (ఈడీ) మంగళవారం దాడులు చేపట్టింది. మనీలాండరింగ్​ కేసు దర్యాప్తులో భాగంగా ఈ సోదాలు నిర్వహించిన ఈడీ.. ఠాణెలోని నీలాంబరి ప్రాజెక్టులో భాగమైన 11 రెసిడెన్షియల్​ ఫ్లాట్లను అటాచ్​ చేసింది. శ్రీసాయిబాబా గృహనిర్మితి ప్రైవేట్​ లిమిటెడ్​కు చెందిన ఈ ఆస్తులు ఉద్ధవ్‌ ఠాక్రే బావమరిది (ఠాక్రే సతీమణి రష్మీ ఠాక్రే సోదరుడు) శ్రీధర్​ మాధవ్​ పటాంకర్​ పేరుపై ఉన్నాయి. మొత్తం రూ.6.45 కోట్లు విలువ చేసే ఆస్తులను ఈడీ అటాచ్​ చేసింది.

పుష్పక్ ​గ్రూప్​ మనీలాండరింగ్​ కేసు దర్యాప్తులో భాగంగా.. సంబంధిత సంస్థ శ్రీధర్​ మాధవ్​కు చెందిన శ్రీసాయిబాబా గృహనిర్మితికి నగదును బదిలీ చేసినట్లు తమకు సమాచారం అందిందని ఈడీ వెల్లడించింది. పుష్పక్​ గ్రూప్​ కేసు నిందితుడు మహేశ్​ పటేల్​, మరో నిందితుడు నందకిశోర్​ చతుర్వేది సాయంతో శ్రీధర్​ మాధవ్​ సంస్థలోకి నగదును బదిలీ చేసినట్లు తెలిపింది. దాదాపు రూ.50 కోట్లను శ్రీధర్​ మాధవ్​ సంస్థకు చెందిన రియల్​ ఎస్టేట్​ ప్రాజెక్టుల్లో పెట్టుబడిగా పెట్టినట్లు తెలిపింది.

సీఎం ఠాక్రే బంధువు ఆస్తులను ఈడీ అటాచ్​ చేయడంపై శివసేన నేత సంజయ్​ రౌత్​ విమర్శలు గుప్పించారు. ‘భాజపా అధికారంలో లేని రాష్ట్రాల్లో మాత్రమే ఈడీ చర్యలు చేపడుతోంది. గుజరాత్‌ లాంటి రాష్ట్రాల్లో ఈడీ కార్యాలయాలను మూసేసినట్టు ఉంది. సంస్థ కార్యకలాపాలన్నీ మహారాష్ట్రలోనే జరుగుతున్నట్లు ఉంది. మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్​ బెనర్జీని కూడా ఇదే విధంగా వేధించారు. కానీ అటు బెంగాల్​, ఇటు మహారాష్ట్ర రెండూ ఈ చర్యలకు లొంగిపోవు’ అని రౌత్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని