కాంగ్రెస్‌: సీఎం అభ్యర్థి లేకుండానే ఎన్నికల బరిలోకి!

కేరళలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యునైటెడ్‌ డెమొక్రాటిక్‌ ఫ్రంట్‌(యూడీఎఫ్‌) మాత్రం ఎన్నికల తర్వాతే తమ సీఎం అభ్యర్థిని ప్రకటిస్తామని వెల్లడించింది.

Published : 29 Mar 2021 17:16 IST

ఎన్నికల తర్వాతే నిర్ణయిస్తామన్న అధిష్ఠానం

తిరువనంతపురం: శాసనసభ ఎన్నికల్లో గెలిచేందుకు కేరళ రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలతో ముమ్మర ప్రచారం చేస్తున్నాయి. కేరళలో అన్ని అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 6 ఒకేసారి ఎన్నికలు జరుగనున్నాయి. ఇందుకోసం అటు అధికార ఎల్‌డీఎఫ్‌, ప్రతిపక్ష యూడీఎఫ్‌తో పాటు భారతీయ జనతా పార్టీ ప్రచారంలో నిమగ్నమయ్యాయి. అయితే, ఎల్‌డీఎఫ్‌, భాజపా తమ ముఖ్యమంత్రి అభ్యర్థుల్ని ఖరారు చేసినప్పటికీ కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ మాత్రం ఇంతవరకు సీఎం అభ్యర్థిని ప్రకటించలేదు. అసెంబ్లీ ఎన్నికల తర్వాతే ముఖ్యమంత్రి ఎవరన్నది నిర్ణయిస్తామని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యుడు, మాజీ రక్షణశాఖ మంత్రి ఏకే ఆంటోని పేర్కొన్నారు.

కేరళలో కాంగ్రెస్‌ పార్టీలో చాలాకాలంగా వర్గపోరు నడుస్తున్నట్లు పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తూ సీనియర్‌ నేత పీసీ చాకో కూడా కాంగ్రెస్‌ పార్టీని వీడి ఎన్‌సీపీలో చేరారు. ఇక ఇప్పటికే రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఉమెన్‌ చాందీ ఓవైపు, ప్రతిపక్ష నేతగా ఉన్న రమేష్‌ చెన్నితాల వర్గంతో కాంగ్రెస్ అధిష్ఠానం సతమతమవుతోంది. ఇద్దరు కీలక నేతలే కావడంతో వీరిలో ఎవరిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలన్న విషయంపై కాంగ్రెస్‌ ఓ నిర్ణయానికి రాలేకపోతున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే ఎన్నికల తర్వాతే సీఎం అభ్యర్థిని ప్రకటిస్తామని కాంగ్రెస్‌ పేర్కొంటున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు