పాక్‌ చదువులు మనకొద్దు.. విద్యార్థులను హెచ్చరించిన యూజీసీ, ఏఐసీటీఈ

పాకిస్థాన్‌ విద్యాసంస్థల్లో ఎవరూ తమ పేరును నమోదు చేసుకోవద్దని విశ్వవిద్యాలయాల నిధుల సంఘం, అఖిల భారత సాంకేతిక విద్యామండలి ఇక్కడి విద్యార్థులను కోరింది....

Updated : 23 Apr 2022 17:04 IST

దిల్లీ: పాకిస్థాన్‌ విద్యాసంస్థల్లో ఎవరూ తమ పేరును నమోదు చేసుకోవద్దని ‘విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (UGC)’, ‘అఖిల భారత సాంకేతిక విద్యామండలి (AICTE)’ ఇక్కడి విద్యార్థులను కోరింది. దీన్ని ఉల్లంఘించిన వారు భారత్‌లో పై చదువులకు, ఉద్యోగానికి అర్హత కోల్పోతారని స్పష్టం చేసింది. పై చదువుల నిమిత్తం ఎవరూ పాకిస్థాన్‌కు వెళ్లొద్దని తేల్చి చెప్పింది.

భారత పౌరులు, ‘ఓవర్సీస్‌ సిటిజన్‌ ఆఫ్‌ ఇండియా’ విద్యార్థులకు ఈ నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది. అయితే, పాక్‌ నుంచి భారత్‌కు వలస వచ్చినవారు, వారి పిల్లలు ఇక్కడి పౌరసత్వం పొంది ఉంటే ఇక్కడి ఉద్యోగాలకు అర్హులేనని స్పష్టం చేసింది. అయితే, వారు కేంద్ర హోంశాఖ నుంచి ‘సెక్యూరిటీ క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌’ పొంది ఉండాలని తెలిపింది.

భారత ప్రమాణాలకు అనుగుణంగా లేని డిగ్రీలను పొంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోవద్దని ఏఐసీటీఈ ఛైర్మన్‌ అనిల్‌ సహస్రబుద్ధే తెలిపారు. భారత్‌ వెలుపల విద్యనభ్యసించాలనుకునే విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే ఈ మార్గదర్శకాలను జారీ చేశామని యూజీసీ ఛైర్మన్‌ జగదీశ్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఇటీవల కొంతమంది విదేశాల నుంచి తిరిగొచ్చి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో గమనించామన్నారు. పరోక్షంగా ఉక్రెయిన్‌ నుంచి వచ్చిన వైద్య విద్యార్థుల సమస్యలను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని విద్యాసంస్థల్లోనూ విద్యనభ్యసించడాన్ని నిషేధిస్తూ 2019లో యూజీసీ మార్గదర్శకాలు జారీ చేసిన విషయం తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని