UGC: ఆ పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లకు గుర్తింపులేదు.. మోసపోవద్దు: యూజీసీ హెచ్చరిక

విదేశీ విద్యా సంస్థల సహకారంతో ఎడ్‌టెక్‌ కంపెనీలు అందించే ఆన్‌లైన్‌ పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లకు గుర్తింపు లేదని UGC, AICTE తేల్చి చెప్పాయి.

Published : 29 Oct 2022 01:43 IST

దిల్లీ: ఆన్‌లైన్‌ పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌(Online PhD programmes)లపై యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (UGC) అఖిల భారత సాంకేతిక విద్యా విభాగం(ఏఐసీటీఈ) కీలక హెచ్చరికలు చేశాయి. విదేశీ విద్యా సంస్థల సహకారంతో ఎడ్‌టెక్‌ కంపెనీలు అందించే ఆన్‌లైన్‌ పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లకు గుర్తింపు లేదని తేల్చి చెప్పాయి. ఈ మేరకు గురువారం రెండు అత్యున్నత సంస్థలు ఉమ్మడి ప్రకటన జారీ చేశాయి. ఎడ్‌టెక్ కంపెనీలు అందించే ఆన్‌లైన్ పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లకు సంబంధించిన ప్రకటనలు చూసి మోసపోవద్దని విద్యార్థులు, ప్రజలకు విజ్ఞప్తి చేశాయి. అలాంటి ఆన్‌లైన్‌ పీహెచ్‌డీ ప్రొగ్రామ్‌లను యూజీసీ గుర్తించదని పేర్కొన్నాయి. ఔత్సాహిక విద్యార్థులు పీహెచ్‌డీ అడ్మిషన్‌ తీసుకోవడానికి ముందు యూజీసీ రెగ్యులేషన్‌ 2016 ప్రకారం ఆయా పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ల ప్రామాణికతను నిర్ధారించుకోవాలని సూచించాయి. అలాగే, అన్ని భారతీయ ఉన్నత విద్యా సంస్థలూ పీహెచ్‌డీ డిగ్రీలను ప్రదానం చేసేందుకు యూజీసీ నిబంధనలు, సవరణలను అనుసరించడం తప్పనిసరని తేల్చి చెప్పాయి. 

యూజీసీ, ఏఐసీటీఈ ఈ తరహా హెచ్చరికలు చేయడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి కావడం గమనార్హం. ఈ ఏడాది ఆరంభంలోనూ ఎడ్-టెక్ కంపెనీలతో కలిసి దూరవిద్య, ఆన్‌లైన్‌ మోడ్‌లో కోర్సులు అందించకుండా గుర్తింపు పొందిన వర్సిటీలు, సంస్థలకు యూజీసీ, ఏఐసీటీఈ కీలక హెచ్చరికలు చేశాయి. నిబంధనల ప్రకారం ఫ్రాంఛైజ్‌ ఒప్పందానికి అనుమతి లేదని పేర్కొన్నాయి.


Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని