UGC: ఏటా రెండుసార్లు అడ్మిషన్లు

విదేశీ విశ్వవిద్యాలయాల తరహాలోనే ఇక నుంచి దేశంలోని వర్సిటీల్లో, ఉన్నత విద్యా సంస్థల్లో ఏటా రెండు సార్లు అడ్మిషన్లు జరపాలని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) నిర్ణయించింది.

Updated : 12 Jun 2024 06:10 IST

వర్సిటీల్లో ప్రవేశాలపై యూజీసీ కీలక నిర్ణయం

దిల్లీ: విదేశీ విశ్వవిద్యాలయాల తరహాలోనే ఇక నుంచి దేశంలోని వర్సిటీల్లో, ఉన్నత విద్యా సంస్థల్లో ఏటా రెండు సార్లు అడ్మిషన్లు జరపాలని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) నిర్ణయించింది. ఈ విద్యా సంవత్సరం (2024-25) నుంచే ఈ విధానం అమల్లోకి వస్తుందని యూజీసీ ఛైర్మన్‌ ఆచార్య జగదీశ్‌ కుమార్‌ తెలిపారు. తొలి విడతలో జులై-ఆగస్టు, మలి విడతలో జనవరి-ఫిబ్రవరిలలో అడ్మిషన్లు జరుగుతాయని వెల్లడించారు. అయితే ఈ విధానం తప్పనిసరి కాదని, ఐచ్ఛికమేనని స్పష్టం చేశారు. ‘ఏడాదికి రెండు సార్ల అడ్మిషన్ల విధానంవల్ల వివిధ బోర్డుల ఫలితాల ప్రకటనలో జాప్యం, ఆరోగ్య సమస్యలు, వ్యక్తిగత కారణాలవల్ల జులై-ఆగస్టులలో ప్రవేశాలు పొందలేని వారికి ప్రయోజనం కలుగుతుంది. దీనివల్ల వారు మరుసటి ఏడాది వరకూ వేచి ఉండాల్సిన అవసరం లేదు. ద్వైవార్షిక ప్రవేశాలవల్ల కంపెనీలు ప్రాంగణ నియామకాలను ఏడాదికి రెండుసార్లు చేస్తాయి. దీంతో గ్రాడ్యుయేట్లకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి’ అని జగదీశ్‌ కుమార్‌ వివరించారు. 

‘రెండుసార్లు ప్రవేశాలు జరపడంవల్ల విద్యా సంస్థలు తమ వనరులను సమర్థంగా పంపిణీ చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది. ఫ్యాకల్టీ, ల్యాబ్‌లు, తరగతి గదులు, ఇతర అవకాశాలను సమర్థంగా వినియోగించుకోవచ్చు. ఫలితంగా వర్సిటీల వ్యవస్థలు అత్యుత్తమంగా పని చేయగలుగుతాయి’ అని ఆయన తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని