
Covid Pill: కొవిడ్ చికిత్సలో సరికొత్త అధ్యాయం.. మాత్రలకు బ్రిటన్ ఆమోదం!
లండన్: కొవిడ్ చికిత్సావిధానంలో మరో కొత్త అధ్యాయం మొదలుకానుంది! మహమ్మారిపై పోరాటానికి మెర్క్, రిడ్జ్‌బ్యాక్ బయోథెరప్యూటిక్స్ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన యాంటీవైరల్ మాత్రను బ్రిటన్ గురువారం ఆమోదించింది. దీంతో ఈ తరహా చికిత్సకు పచ్చజెండా ఊపిన మొదటి దేశంగా నిలిచింది. కొవిడ్ చికిత్సకు ఆమోదం పొందిన మొదటి ఓరల్ యాంటీవైరల్ చికిత్స ఇదే కావడం విశేషం. కరోనా పాజిటివ్‌గా తేలితే.. వీలైనంత త్వరగా లేదా లక్షణాలు కనిపించిన అయిదు రోజుల్లోపు మోల్నుపిరవిర్ మాత్రలను వాడాలని ఇక్కడి మెడిసిన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ(ఎన్హెచ్ఆర్ఏ) సిఫార్సు చేసింది. బ్రిటన్‌లో మోల్నుపిరవిర్‌ను ‘లగేవ్రియో’ అనే బ్రాండ్‌తో రూపొందించారు.
అమెరికా ఊగిసలాడుతున్న తరుణంలో..
కొవిడ్ చికిత్సలో మోల్నుపిరవిర్‌ను వినియోగించాలా వద్దా అనే అంశంపై అమెరికా మెడిసిన్ రెగ్యులేటరీ నిపుణులు ఈ నెలలో సమావేశం కానున్న తరుణంలో.. బ్రిటన్‌లో ఆమోదం లభించడం కీలకంగా మారింది. వైరస్ ప్రారంభ దశలో ఉన్నప్పుడు ఈ చికిత్స ప్రారంభిస్తే.. రోగి ఆసుపత్రి పాలవ్వడం, మరణించే అవకాశాలను సగానికి తగ్గించగలదని ట్రయల్స్‌లో తేలింది. మరోవైపు బ్రిటన్ ప్రభుత్వం.. ఈ చికిత్స విధానం మార్గదర్శకాలను ఖరారు చేయనుంది. ఇప్పటికే 4.80 లక్షల మాత్రల కోసం ‘మెర్క్’తో ఒప్పందం కుదుర్చుకుంది. మరోవైపు ఈ ఏడాది చివరి నాటికి కోటి మాత్రలను ఉత్పత్తి చేయాలని భావిస్తున్నట్లు మెర్క్ ఓ ప్రకటనలో తెలిపింది. 2022లో కనీసం రెండు కోట్లు ఉత్పత్తి చేస్తామని వెల్లడించింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.