Published : 04 Jan 2021 14:51 IST

82ఏళ్ల వ్యక్తికి ఆక్స్‌ఫర్డ్‌ తొలి టీకా

 బ్రిటన్‌లో ఆస్ట్రాజెనెకా టీకా పంపిణీ ప్రారంభం 

లండన్‌: బ్రిటన్‌ ప్రభుత్వం అత్యవసరం వినియోగం కోసం అనుమతించిన ఆస్ట్రాజెనెకా టీకా పంపిణీ కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ ఆసుపత్రిలో 82 ఏళ్ల రిటైర్డ్‌ మేనేజర్‌ బ్రెయిన్‌ పింకర్‌ తొలి టీకా తీసుకున్నట్లు ఇంగ్లాండ్‌ నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌ వెల్లడించింది. డయాలసిస్‌ పేషెంట్ అయిన పింకర్‌.. కొవిడ్‌ టీకా తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇక తన 48వ పెళ్లిరోజు కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. 

ఆక్స్‌ఫర్ఢ్‌ యూనివర్శిటీ భాగస్వామ్యంతో ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన టీకాకు అత్యవసర వినియోగం కింద బ్రిటన్‌ ప్రభుత్వం గతేడాది డిసెంబరు 30న అనుమతులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. నేటి నుంచి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ చేపట్టారు. ప్రస్తుతం తమ వద్ద ఐదు లక్షలకు పైగా ఆస్ట్రాజెనెకా టీకా డోసులు ఉన్నట్లు యూకే అధికారులు వెల్లడించారు. తొలిదశలో భాగంగా ఆరు ఆసుపత్రుల్లో ఈ టీకా పంపిణీ చేపట్టారు. త్వరలోనే మరిన్ని డోసులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. ఈ కంపెనీ నుంచి యూకే ఇప్పటికే 100 మిలియన్‌ డోసుల కోసం ఆర్డర్‌ చేసింది. మార్చి చివరి నాటికి ఈ డోసులను డెలివరీ చేయనున్నట్లు తెలుస్తోంది. 

బ్రిటన్‌లో ఇప్పటికే ఫైజర్‌ టీకా పంపిణీ జరుగుతోన్న విషయం తెలిసిందే. డిసెంబరు 8న 90ఏళ్ల మార్గరెట్‌ కీనన్‌ ప్రపంచంలోనే తొలి కరోనా టీకా తీసుకున్నారు. ఇప్పటి వరకు యూకేలో ఆరు లక్షల మందికి పైగా ఫైజర్‌ టీకా వేయించుకున్నారు. తొలి డోసు తీసుకొన్నవారికి గతవారం నుంచి రెండో డోసు కూడా ఇస్తున్నారు. 

బ్రిటన్‌తో పాటు అర్జెంటీనా, ఎల్‌ సాల్వడార్‌, భారత్‌ దేశాలు ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా టీకా అత్యవసర వినియోగాన్ని అనుమతించాయి. అయితే, ఈ టీకా పంపిణీ తొలి పంపిణీ మాత్రం బ్రిటన్‌లోనే మొదలైంది. అర్జెంటీనా, ఎల్‌ సాల్వడార్‌లో మరికొద్ది రోజుల్లో వ్యాక్సినేషన్‌ చేపట్టనున్నారు.

భారత్‌లోనూ ముందు ఆస్ట్రాజెనెకానే..

భారత్‌లో ఈ టీకాను సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ఉత్పత్తి చేస్తోంది. ‘కొవిషీల్డ్‌’ పేరుతో తీసుకొచ్చిన ఈ టీకా అత్యవసర వినియోగానికి భారత్‌ కూడా ఇటీవలే అనుమతి మంజూరు చేసింది. దీంతో పాటు భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన ‘కొవాగ్జిన్‌’ వినియోగానికి కూడా ఆమోదముద్ర వేసింది. అయితే, తొలుత కొవిషీల్డ్‌ టీకానే పంపిణీ చేసే అవకాశాలున్నట్లు ఎయిమ్స్‌ చీఫ్‌ రణదీప్‌ గులేరియా తెలిపారు.

ఇవీ చదవండి..

అతి పెద్ద టీకా పంపిణీ.. త్వరలోనే ప్రారంభం: మోదీ

ఇదిగో టీకాస్త్రం

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని