కొత్త కలవరం: దేశంలో 795 కేసులు

దేశంలో కరోనా కొత్త రకం కేసులు భారీగా బయటపడుతున్నాయి. బ్రిటన్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ రకాలకు చెందిన కొత్త కేసులు ప్రస్తుతం 795కు చేరుకున్నాయని మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Published : 23 Mar 2021 18:21 IST

5 రోజుల్లోనే సుమారు రెట్టింపు కేసులు

దిల్లీ: దేశంలో కరోనా కొత్త రకం కేసులు భారీగా బయటపడుతున్నాయి. బ్రిటన్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ రకాలకు చెందిన కొత్త కేసులు ప్రస్తుతం 795కు చేరుకున్నాయని మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మార్చి 18 నాటికి 400గా ఉన్న ఈ కొత్త కేసులు..ఐదు రోజుల వ్యవధిలోనే సుమారు రెట్టింపయ్యాయి. ఒకవైపు దేశంలో మరోసారి కరోనా తన ఉనికిని చాటుతోన్న నేపథ్యంలో..కొత్త రకాలు కలవరపెడుతున్నాయి. ఈ కొత్త రకాలకు వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఉందని వైద్యనిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఈ తరహా కేసుల పెరుగుదలపై తాజాగా పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. వాటి కట్టడికి యువతను కూడా కరోనా టీకా కార్యక్రమం కిందికి తీసుకురావాలని ఆయన ప్రధాని మోదీని అభ్యర్థించారు.  

మరోవైపు, దేశంలో కొద్ది రోజులుగా 40వేలకు పైనే కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి. దాంతో వరుసగా 13వ రోజు కూడా క్రియాశీల కేసులు పెరిగి.. 3.45లక్షలకు చేరుకున్నాయి. ఈ మహమ్మారికి అడ్డుకట్ట వేసే లక్ష్యంతో కేంద్రం టీకా కార్యక్రమ పరిధిని మరింత విస్తరించింది. 45 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసు కలిగిన వారికి  ఏప్రిల్ ఒకటి నుంచి టీకాలు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని