UK: రెండు డోసులు తీసుకున్న ఆరోగ్యమంత్రికి కరోనా!

బ్రిటన్‌ ఆరోగ్యశాఖ మంత్రి సాజిద్‌ జావిద్‌ కరోనా వైరస్ బారినపడ్డారు. కేవలం స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని పేర్కొన్న ఆయన.. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నట్లు ప్రకటించారు. 

Published : 18 Jul 2021 16:07 IST

ఐసోలేషన్‌లో బ్రిటన్‌ ప్రధాని, మరో మంత్రి

లండన్‌: బ్రిటన్‌ ఆరోగ్యశాఖ మంత్రి సాజిద్‌ జావిద్‌ కరోనా వైరస్ బారినపడ్డారు. కేవలం స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని పేర్కొన్న ఆయన.. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నట్లు ప్రకటించారు. తనతో సన్నిహితంగా మెలిగిన వారిని కొవిడ్ టెస్టు చేయించుకోవాలని సాజిద్‌ సూచించారు. దీంతో బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌, ఆర్థిక మంత్రి రిషి సునక్‌లు ఐసోలేషన్‌లో ఉంటునట్లు బ్రిటన్‌ ఆరోగ్యశాఖ ప్రకటించింది. అయితే, సాజిద్‌ జావిద్‌ ఇప్పటికే వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్న తర్వాత వైరస్‌ బారిన పడటం గమనార్హం.

బ్రిటన్‌ జాతీయ హెల్త్‌ సర్వీస్‌ (NHS) ప్రకారం, పాజిటివ్‌ సోకిన వ్యక్తులు పది రోజులపాటు సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉండాల్సి ఉంటుంది. ఆర్‌టీ పీసీఆర్‌ నివేదిక నెగటివ్‌ వచ్చిన తర్వాత విధులకు హాజరు కావాలి. మొన్నటి వరకు బ్రిటన్‌ ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న మ్యాట్‌ హ్యాన్‌కాక్‌ రాజీనామా చేయడంతో జూన్ 26న ఆరోగ్యశాఖ మంత్రిగా సాజిద్‌ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.

ఇక కొవిడ్‌ ఆంక్షలను సడలించేందుకు సిద్ధమైన నేపథ్యంలో బ్రిటన్‌లో కరోనా వైరస్‌ మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. ఈ ఏడాది జనవరి తర్వాత రోజువారీ కేసులు తొలిసారి 50వేలు దాటాయి. రానున్న వారాల్లో ఈ సంఖ్య రెట్టింపయ్యే అవకాశాలున్నాయని ఆరోగ్యమంత్రి జావెద్‌ వెల్లడించారు. ఇదే సమయంలో వైరస్‌ నుంచి ఎవ్వరికీ రక్షణ లేదనే విషయం జావెద్‌కు పాజిటివ్‌ రావడం వల్ల అర్థమవుతోందని ప్రతిపక్ష లిబరల్‌ డెమోక్రాట్‌ పార్టీ అధికార ప్రతినిధి మునీరా విల్సన్‌ పేర్కొన్నారు.

ఇదిలాఉంటే, కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న వారికీ వైరస్‌ సోకే అవకాశాలుంటాయని నిపుణులు వెల్లడిస్తోన్న విషయం తెలిసిందే. అయితే, అలాంటివారికి ఆస్పత్రి చేరికలు, ప్రాణాపాయం లేదని ఇప్పటికే పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. అందుకే ప్రతిఒక్కరూ వ్యాక్సిన్‌ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని