మోదీజీ.. జీ-7 సదస్సుకి అతిథిగా రండి!

ఈ ఏడాది జ‌రగ‌బోయే జీ-7 స‌ద‌స్సుకు హాజ‌రు కావాల్సిందిగా ప్రధాని న‌రేంద్ర మోదీని యునైటెడ్ కింగ్‌డ‌మ్ ఆహ్వానించింది. భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, దక్షిణ కొరియాకు కూడా ఆహ్వానం పంపింది. జూన్‌లో జరగబోయే ఈ సదస్సుకు బ్రిటన్‌ తీర ప్రాంతంలో.......

Published : 17 Jan 2021 19:18 IST

యూకే ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ఆహ్వానం

దిల్లీ : ఈ ఏడాది జ‌రగ‌బోయే జీ-7 స‌ద‌స్సుకు హాజ‌రు కావాల్సిందిగా ప్రధాని న‌రేంద్ర మోదీని యునైటెడ్ కింగ్‌డ‌మ్ ఆహ్వానించింది. భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, దక్షిణ కొరియాకు కూడా ఆహ్వానం పంపింది. జూన్‌లో జరగబోయే ఈ సదస్సుకు బ్రిటన్‌ తీర ప్రాంతంలో ఉన్న కార్న్‌వాల్‌ రిసార్ట్‌ వేదిక కానుంది. ప్రపంచంలో ఆర్థికంగా అభివృద్ధి చెందిన కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికా దేశాల కూటమే ఈ జీ-7. ఈ స‌ద‌స్సులో భాగంగా క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి, ప‌ర్యావ‌ర‌ణ మార్పులు, సాంకేతిక‌ప‌ర‌మైన అభివృద్ధి, శాస్త్రీయ ఆవిష్కర‌ణ‌లు, స్వేచ్ఛా వాణిజ్యంపై చ‌ర్చించ‌నున్నారు.

అయితే, ఈ ఏడాది గణతంత్ర వేడుకలకు ముఖ్యఅతిథిగా యూకే ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ను భారత్‌ ఆహ్వానించిన విషయం తెలిసిందే. కానీ, కరోనా కొత్త స్ట్రెయిన్‌ యూకేలో విజృంభిస్తుండడంతో ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నారు. అయితే, జీ-7 స‌ద‌స్సు కంటే ముందే భారత్‌లో పర్యటించే అంశాన్ని బోరిస్‌ పరిశీలిస్తున్నట్లు అక్కడి స్థానిక వార్తా సంస్థలు పేర్కొన్నాయి. 2020లో జరగాల్సిన జీ-7 సదస్సు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షతన జరగాల్సి ఉండగా.. కరోనా కారణంగా అవి వాయిదా పడ్డాయి. 2019లో ఫ్రాన్స్‌లోని బియారిట్జ్‌లో చివరి సమావేశం జరిగింది. అయితే, జీ-7కు భారత్‌కు ఆహ్వానం అందడం ప్రాధాన్యం సంతరించుకుంది. అంతర్జాతీయ వేదికలపై భారత్‌కు పెరుగుతున్న ప్రాధాన్యాన్ని ఇది సూచిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇవీ చదవండి..

భారతీయులకు బైడెన్‌ పెద్దపీట!

ఆందోళనలో అగ్రరాజ్యం!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని