Gandhi Coin: మహాత్ముడికి బ్రిటన్‌ ఘన నివాళి.. దీపావళి వేళ స్మారక నాణెం విడుదల

మహాత్మాగాంధీని బ్రిటన్‌ ప్రభుత్వం ఘనంగా స్మరించుకుంది. దీపావళి పర్వదినం పురస్కరించుకుని బాపూజీ జీవితం, ఆశయాలను ప్రతిబింబిస్తూ.. కొత్తగా రూపొందించిన 5 పౌండ్ల స్మారక నాణెన్ని బ్రిటన్‌ ఆర్థిక మంత్రి రిషి సునక్‌ గురువారం ఆవిష్కరించారు. ప్రపంచవ్యాప్తంగా...

Updated : 05 Nov 2021 12:31 IST

లండన్‌: మహాత్మాగాంధీని బ్రిటన్‌ ప్రభుత్వం గొప్పగా స్మరించుకుంది! దీపావళి పర్వదినం పురస్కరించుకుని బాపూజీ జీవితం, ఆశయాలను ప్రతిబింబిస్తూ.. కొత్తగా రూపొందించిన 5 పౌండ్ల స్మారక నాణెన్ని బ్రిటన్‌ ఆర్థిక మంత్రి రిషి సునక్‌ గురువారం ఆవిష్కరించారు. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందికి ఆదర్శంగా నిలిచిన ప్రభావవంతమైన నాయకుడికి ఇది ఘనమైన నివాళి అని సునక్ పేర్కొన్నారు. ‘దీపావళి సందర్భంగా ఈ నాణెన్ని ఆవిష్కరించడం గర్వంగా ఉంది. భారత స్వాతంత్య్ర ఉద్యమంలో గాంధీ కీలకపాత్ర పోషించారు. ఈ క్రమంలో మహాత్ముడి జీవితాన్ని స్మరించుకుంటూ మొదటిసారి బ్రిటన్‌ నాణెం రూపొందించడం అద్భుతంగా ఉంది’ అని వివరించారు. ఈ ఏడాది భారత్‌ ‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌’ జరుపుకొంటున్న ప్రత్యేక సందర్భంలో.. ఈ స్మారక నాణెం ఇరు దేశాల మధ్య శాశ్వత సంబంధాలు, సాంస్కృతిక వారధికి ప్రతీకగా నిలుస్తుందని చెప్పారు.

రాయల్‌ మింట్‌ వెబ్‌సైట్‌ విక్రయాలు..

హీనా గ్లోవర్‌ అందించిన ఆకృతిలో రూపొందించిన ఈ స్మారక నాణెంలో భారత జాతీయ పుష్పం కమలం పువ్వుతోపాటు గాంధీ ప్రముఖ సూక్తుల్లో ఒకటైన ‘మై లైఫ్‌ ఇజ్‌ మై మెసేజ్‌’ను పొందుపరిచారు. బంగారం, వెండితోపాటు ఇతర రకాల్లోనూ ఇది అందుబాటులో ఉంది. గురువారం నుంచి బ్రిటన్‌ రాయల్ మింట్ వెబ్‌సైట్‌లో వీటిని అమ్మకానికి పెట్టారు. 20వ శతాబ్దపు గొప్ప వ్యక్తుల్లో ఒకరైన మహాత్మాగాంధీని స్మారక నాణెంతో గౌరవించడం గర్వంగా ఉందని రాయల్ మింట్ ఈ సందర్భంగా పేర్కొంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని