Booster Dose: ఒమిక్రాన్‌ కలవరం.. ఇంగ్లాండ్‌లో 30 ఏళ్లు దాటిన వారికీ బూస్టర్‌

స్థానికంగా వేగంగా వ్యాప్తి చెందుతున్న ‘ఒమిక్రాన్‌’ వేరియంట్‌ను కట్టడి చేసేందుకు బ్రిటన్‌ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇంగ్లాండ్‌లో 30 ఏళ్లు, ఆపైబడిన వారికీ బూస్టర్ డోసుల కోసం సోమవారం నుంచి బుకింగ్‌లు తెరిచి ఉంచుతున్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు...

Published : 12 Dec 2021 23:55 IST

లండన్‌: స్థానికంగా వేగంగా వ్యాప్తి చెందుతున్న ‘ఒమిక్రాన్‌’ వేరియంట్‌ను కట్టడి చేసేందుకు బ్రిటన్‌ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇంగ్లాండ్‌లో 30 ఏళ్లు, ఆపైబడిన వారికీ బూస్టర్ డోసుల కోసం సోమవారం నుంచి బుకింగ్‌లు తెరిచి ఉంచుతున్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. 30- 39 ఏళ్ల మధ్య ఉన్న 35 లక్షల మంది సోమవారం నుంచి బూస్టర్‌ డోసులకు అర్హులని ఇంగ్లాండ్ నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌ తెలిపింది. ఒమిక్రాన్‌పై బూస్టర్‌ డోసులు ప్రభావం చూపుతున్నాయన్న ప్రాథమిక విశ్లేషణల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రెండో డోస్ పొందిన రెండు నెలల తర్వాత బూస్టర్‌కు బుకింగ్ చేసుకోవచ్చు.

జేసీవీఐ సిఫార్సుల మేరకు..

కొత్త వేరియంట్ కారణంగా బ్రిటన్‌లో ఇప్పటివరకు మరణాలు నమోదు కాలేదు. కానీ, ఈ ఏడాది చివరి నాటికి ఒమిక్రాన్‌ కేసులు.. డెల్టా కేసులను దాటేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. వ్యాక్సినేషన్‌ అండ్‌ ఇమ్యునైజేషన్ జాయింట్ కమిటీ(జేసీవీఐ) సిఫార్సుల మేరకు బూస్టర్‌ డోసుల ప్రక్రియను విస్తరిస్తోంది. ‘ఈ కార్యక్రమం క్రమంగా పుంజుకుంటోంది. యూకేవ్యాప్తంగా 2.2 కోట్లకుపైగా అర్హులు ఇప్పటికే బూస్టర్‌ డోసు పొందారు’ అని ఆరోగ్య కార్యదర్శి సాజిద్ జావిద్ వెల్లడించారు. వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు శక్తిమేర కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం దీన్ని 30 ఏళ్లు పైబడిన వారికీ విస్తరిస్తున్న నేపథ్యంలో.. అర్హులందరూ త్వరగా ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని