Boris Johnson: బ్రిటన్‌ ప్రధాని రహస్య పరిణయం?

బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ రహస్యంగా వివాహం చేసుకొన్నట్లు అక్కడి పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. ప్రియురాలు కారీ   సైమోడ్స్‌నే పెళ్లి చేసుకొన్నారని పేర్కొన్నాయి.  సెంట్రల్‌ లండన్‌లో జరిగిన ఈ వేడుకలో

Updated : 30 May 2021 12:41 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ రహస్యంగా వివాహం చేసుకున్నట్లు అక్కడి పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. ప్రియురాలు కారీ  సైమోడ్స్‌నే పెళ్లి చేసుకున్నారని పేర్కొన్నాయి.  సెంట్రల్‌ లండన్‌లో జరిగిన ఈ వేడుకలో పాల్గొనేందుకు చివరి నిమిషంలో  అతిథులకు ఆహ్వానాలు వెళ్లాయి. ఈ పెళ్లి విషయం ప్రధాని కార్యాలయంలో సీనియర్‌ అధికారులకు కూడా తెలియనీయలేదు. వీరి పెళ్లి జరిగిన కేథలిక్‌ కెథడ్రాల్‌ని మధ్యాహ్నం 1.30 సమయంలో మూసివేశారు. ఒక అర్ధగంట తర్వాత 33 ఏళ్ల సైమోడ్స్‌ లిమోజిన్‌ వాహనంలో అక్కడకు వచ్చారు. ఆమె తెల్లటి గౌను ధరించి ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో పెళ్లిళ్లకు కేవలం 30 మంది అతిథులుమాత్రమే ఉండాలనే నిబంధన అమల్లో ఉంది. ఈ అంశంపై బ్రిటన్‌ ప్రధాని అధికార నివాసమైన డౌనింగ్‌ స్ట్రీట్‌ ప్రతినిధి స్పందించేందుకు నిరాకరించారు.

జాన్సన్‌ , సైమోడ్స్‌తో కలిసి 2019 నుంచి డౌనింగ్‌ స్ట్రీట్‌లో ఉంటున్నారు. వీరిద్దరి ఎంగేజ్‌మెంట్‌ గతేడాది జరిగింది.  2020 ఏప్రిల్‌లో వీరికి ఒక బాబు పుట్టాడు. 2022లో వీరు పెళ్లి చేసుకొంటారనే ప్రచారం జరిగింది. కానీ, హఠాత్తుగా వీరు పెళ్లి చేసుకోవడం బ్రిటన్‌లో సంచలనం సృష్టించింది. వివాహ బంధం విషయంలో గతంలో జాన్సన్‌ విమర్శలు ఎదుర్కొన్నారు. అయనకు ఉన్న వివాహేతర సంబంధం గురించి అబద్ధం చెప్పడంతో ఒక కన్జర్వేటీవ్‌ పార్టీ పాలసీ బృందం నుంచి తొలగించారు. 55 ఏళ్ల జాన్సన్‌కు గతంలో రెండు పెళ్లిళ్లు జరిగాయి. ఇద్దరితోనూ విడిపోయారు. ఆయన రెండో భార్య మారినా వేలర్‌కు నలుగురు సంతానం.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని