విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీ అప్పగింతపై బ్రిటన్‌ ప్రధాని కీలక వ్యాఖ్యలు

దేశంలోని ప్రభుత్వరంగ బ్యాంకులను రూ.వేల కోట్లు మోసగించి లండన్‌ పారిపోయిన ఆర్థిక నేరగాళ్లు విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీ అప్పగింతపై బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌........

Updated : 22 Apr 2022 21:43 IST

దిల్లీ: దేశంలోని ప్రభుత్వరంగ బ్యాంకులను రూ.వేల కోట్లు మోసగించి లండన్‌ పారిపోయిన ఆర్థిక నేరగాళ్లు విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీ అప్పగింతపై బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. వారిని అప్పగించేందుకు బ్రిటన్‌ ప్రభుత్వం ఆదేశించినప్పటికీ.. కొన్ని న్యాయపరమైన అంశాల వల్ల ఈ ప్రక్రియ ‘క్లిష్టతరం’గా మారిందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం భారత్‌ పర్యటనలో ఉన్న బోరిస్‌ జాన్సన్‌.. దిల్లీలో విలేకరులు సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆర్థిక నేరగాళ్లయిన విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీ అప్పగింతపై విలేకరులు ప్రశ్నించగా.. పైవిధంగా సమాధానమిచ్చారు.

నేరారోపణలు ఎదుర్కొంటున్న వారు భారత్‌లో విచారణ ఎదుర్కోవాలని తామూ కోరుకుంటున్నామని బోరిస్‌ జాన్సన్‌ అన్నారు. భారత్‌ నుంచి ప్రతిభ గల వ్యక్తులు రావడానికి తామెప్పుడూ ఆహ్వానం పలుకుతామని చెప్పారు. అదే సమయంలో తమ న్యాయవ్యవస్థను ఉపయోగించుకుని భారతీయ చట్టాల నుంచి తప్పించుకోవాలనుకునే వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ స్వాగతించబోమన్నారు. 

అంతకుముందు బోరిసన్‌ జాన్సన్‌ పర్యటన గురించి విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్దన్‌ ష్రింగ్లా విడుదల చేసిన ప్రకటనలో సైతం ఈ అంశాన్ని ప్రస్తావించారు. లండన్‌ పారిపోయి తలదాచుకుంటున్న ఆర్థిక నేరగాళ్ల అంశం కూడా ఇరు దేశాల ప్రధానుల మధ్య చర్చకు వచ్చిందని తెలిపారు. ఇది ప్రధానమైన విషయమని చెప్పడంతో దీనిపై సమీక్షిస్తానని బోరిస్‌ జాన్సన్‌ హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. భారత్‌ ఆందోళనపై తన వంతు ఏం చేయగలనో అది చేస్తానని బ్రిటన్‌ ప్రధాని భరోసా ఇచ్చినట్లుగా ష్రింగ్లా వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని