ఏప్రిల్‌లో భారత్‌కు బోరిస్‌ జాన్సన్‌!

బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ భారత పర్యటన దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఏప్రిల్‌ నెలాఖర్లో ఆయన భారత పర్యటనకు రానున్నారు. ఈ మేరకు బ్రిటన్‌ ప్రధాని కార్యాలయం సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.

Published : 16 Mar 2021 09:31 IST

లండన్‌: బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ భారత పర్యటన దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఏప్రిల్‌ నెలాఖర్లో ఆయన భారత పర్యటనకు వచ్చే అవకాశముంది. ఈ మేరకు బ్రిటన్‌ ప్రధాని కార్యాలయం సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించినట్లు మీడియా వర్గాలు పేర్కొన్నాయి. ఈ పర్యటనలో భాగంగా ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో యూకే అవకాశాలను మరింత మెరుగుపరిచేందుకు బ్రిటన్‌ సన్నాహాలు చేస్తోంది. కాగా, యూరోపియన్‌ యూనియన్‌(ఐరోపా దేశాల సమాఖ్య) నుంచి బ్రిటన్‌ వైదొలగిన తర్వాత ఆ దేశ ప్రధాని తొలి విదేశీ పర్యటన ఇదే కానుంది. ఇప్పటికే జనవరిలో భారత గణతంత్ర వేడుకలకు బ్రిటన్‌ ప్రధానిని ఇండియా ఆహ్వానించింది. కానీ కరోనా వైరస్‌ కేసుల ఉద్ధృతి నేపథ్యంలో అప్పుడు పర్యటన రద్దయిన విషయం తెలిసిందే.

ఇప్పటికే ఈ ఏడాది జూన్‌లో బ్రిటన్‌లో నిర్వహించే జీ7 సదస్సుకు ప్రధాని మోదీని హాజరుకావాల్సిందిగా యూకే ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయితే జీ7 సదస్సుకు ముందే భారత పర్యటనకు బోరిస్‌ రానున్నట్లు అక్కడి వార్తా సంస్థలు పేర్కొన్నాయి. ‘మేం ఆస్ట్రేలియా, యూఎస్‌ సహా ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటున్నాం. అందులో భాగంగా ఇండోపిసిఫిక్‌ ప్రాంతం ఎంతో కీలకం. భవిష్యత్తులో ఈ ప్రాంతం వాణిజ్య పరంగా అభివృద్ధికి కేంద్రం కానుంది’ అని బ్రిటన్‌ విదేశాంగ మంత్రి డోమినిక్‌ రాబ్‌ గతంలో వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు