Boris Johnson: చరఖా తిప్పిన జాన్సన్‌.. మహాత్ముడి సూత్రాలపై పొగడ్తలు..!

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం భారత్‌కు చేరుకున్నారు. గుజరాత్‌లో దిగిన ఆయనకు ఆ రాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవవ్రత్‌, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ స్వాగతం పలికారు.

Updated : 21 Apr 2022 12:29 IST

రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత్‌ చేరుకున్న బ్రిటన్‌ ప్రధాని

అహ్మదాబాద్‌: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం భారత్‌కు చేరుకున్నారు. గుజరాత్‌లో దిగిన ఆయనకు రాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవవ్రత్‌, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ స్వాగతం పలికారు. తర్వాత ఆయన సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. అక్కడ చరఖా తిప్పారు. ‘ఈ ఆశ్రమానికి రావడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ప్రపంచాన్ని కదిలించడానికి ఆయన సత్యం, అహింస వంటి సాధారణ సూత్రాలతో ముందుకెలా వెళ్లారో అర్థం చేసుకొన్నాను’ అని జాతిపిత మహాత్మా గాంధీ గురించి పేర్కొన్నారు. అలాగే మహాత్ముడి రాసిన పుస్తకాల్లో ఒకటైన, ప్రచురణకాని ‘గైడ్‌ టు లండన్‌’ను జాన్సన్‌కు బహూకరించనున్నారు. 

అలాగే ఇరు దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక సంబంధాలు బలోపేతం చేసే దిశగా భారత ప్రభుత్వంతో జాన్సన్ చర్చలు జరపనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పరిశ్రమల్లో పెట్టుబడులు, వైద్య, పరిశోధన రంగాల్లో కలిసి పనిచేయడంపై ప్రకటనలు వెలువడనున్నాయి. శుక్రవారం దిల్లీ వెళ్లనున్న ఆయన.. ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచాలనే లక్ష్యంతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లే దిశగా వారి మధ్య చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇండో-ఫసిపిక్ ప్రాంత పరిస్థితులు, ఇంధన భద్రత, రక్షణ విషయాల్లో భాగస్వామ్యం వంటి అంశాలు చర్చకురానున్నాయి. ఈ పర్యటనలో జాన్సన్.. బ్రిటన్ వెళ్లాలనుకునే భారతీయ పౌరులకు మరిన్ని వీసాలను ఆఫర్ చేసే అవకాశాలున్నాయి. ఇక ఉక్రెయిన్‌ సంక్షోభం వేళ.. ఆయన పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. అలాగే ఉక్రెయిన్‌ సంక్షోభం గురించి భారత్‌కు ఉపన్యాసాలు ఇవ్వకుండా, మన దేశ అభిప్రాయాలు విననున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని