Boris Johnson: ప్రపంచంలో నేను ఎక్కడా దీనిని పొందలేకపోవచ్చేమో..: జాన్సన్‌

 భారత ప్రభుత్వం నుంచి లభించిన సాదర ఆహ్వానంపై బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆనందం వ్యక్తం చేశారు. దీనిపై ప్రధాని నరేంద్రమోదీకి ధన్యవాదాలు తెలిపారు. 

Updated : 22 Apr 2022 11:52 IST

దిల్లీ: భారత ప్రభుత్వం నుంచి లభించిన ఆహ్వానంపై బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆనందం వ్యక్తం చేశారు. దీనిపై ప్రధాని నరేంద్రమోదీకి ధన్యవాదాలు తెలిపారు. తమ రెండు దేశాల మధ్య ఇప్పుడున్నంత మంచి సంబంధాలు ఎన్నడూ లేవని, ఈ సమయంలో తన పర్యటన శుభ సందర్భమన్నారు. 

నేను ఇంతటి సంతోషకరమైన ఆహ్వానాన్ని ఎప్పుడూ చూడలేదు. ప్రపంచంలో నేను ఎక్కడా దీనిని పొందలేకపోవచ్చేమో’ అంటూ జాన్సన్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆయన రెండు రోజుల భారత్‌ పర్యటనలో భాగంగా గురువారం గుజరాత్‌కు వెళ్లారు. అక్కడి నుంచి ఈ రోజు దిల్లీకి వెళ్లగా.. రాష్ట్రపతి భవన్ వద్ద ఆయనకు ప్రధాని మోదీ ఆహ్వానం పలికారు. అలాగే ఆయనకు అక్కడ గార్డ్ ఆఫ్ హానర్ లభించింది. 

ఇదిలా ఉండగా.. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భద్రత పరంగా సహకారాన్ని అందించుకోవడం, ఇరు దేశాల మధ్య దౌత్య, ఆర్థిక భాగస్వామ్యం వంటి అంశాలపై రెండు దేశాల ప్రధానులు చర్చించుకోనున్నారు. అలాగే విదేశాంగ మంత్రి జై శంకర్‌, జాన్సన్ మధ్య  చర్చలు జరగనున్నాయి. ఇరుపక్షాలు మధ్యాహ్నం హైదరాబాద్‌ హౌస్‌లో మీడియా ప్రకటన విడుదల చేయనున్నారు. 

ఈ రోజు మోదీని కలవడానికి ముందు.. ‘నా స్నేహితుడితో సమావేశమయ్యేందుకు ఎదురుచూస్తున్నాను’ అంటూ యూకే ప్రధాని ఉదయం ట్వీట్ చేశారు. నిరంకుశ రాజ్యాల నుంచి పెరుగుతోన్న బెదిరింపు వేళ.. వాతావరణ మార్పులు, ఇంధన భద్రత, రక్షణ వంటి అంశాల్లో మన ప్రజాస్వామ్య దేశాల భాగస్వామ్యం ముఖ్యమంటూ దానిలో పేర్కొన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా జరుపుతోన్న దురాక్రమణను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని