Ukraine Crisis: ఉక్రెయిన్‌లో భారత ఎంబసీ పోలాండ్‌కు తరలింపు..!

ఉక్రెయిన్‌లో భద్రతా పరిస్థితులు మరింత క్షీణిస్తున్న దృష్ట్యా ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని సమీప పొలాండ్‌కు మార్చుతున్నట్లు భారత ప్రభుత్వం వెల్లడించింది.

Published : 13 Mar 2022 17:34 IST

తాత్కాలికంగా మారుస్తున్నట్లు భారత విదేశాంగశాఖ వెల్లడి

దిల్లీ: రష్యా జరుపుతోన్న దాడులతో ఉక్రెయిన్‌ అట్టుడుకుతోంది. ప్రధాన నగరాలే లక్ష్యంగా దాడులను మరింత ఉద్ధృతం చేస్తోంది. ఇలాంటి ఉద్రిక్తతల సమయంలోనే ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయులందర్నీ కేంద్ర ప్రభుత్వం సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చింది. అయితే, ప్రస్తుతం అక్కడ భద్రతా పరిస్థితులు మరింత క్షీణిస్తున్న దృష్ట్యా ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని సమీప పొలాండ్‌కు మార్చుతున్నట్లు భారత ప్రభుత్వం వెల్లడించింది.

‘ఉక్రెయిన్‌లోని పశ్చిమ ప్రాంతాలతో పాటు అన్ని నగరాల్లో దాడులు కొనసాగుతున్నాయి. దీంతో అక్కడ భద్రతా పరిస్థితులు వేగంగా క్షీణిస్తోన్న దృష్ట్యా భారత రాయబార కార్యాలయాన్ని పోలాండ్‌కు తాత్కాలికంగా మార్చాలని నిర్ణయించాం’ అని భారత విదేశాంగశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ఉక్రెయిన్‌ భూభాగం నుంచి భారతీయులను స్వదేశానికి తరలించే కార్యక్రమం ముగిసిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఉక్రెయిన్‌లో చిక్కుకున్న దాదాపు 20వేల మందిని ‘ఆపరేషన్‌ గంగ’ కార్యక్రమం ద్వారా స్వదేశానికి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.

ఇదిలాఉంటే, ఉక్రెయిన్‌లో సైనిక చర్య తీవ్రతరమవుతోన్న వేళ భారత్‌ కూడా అప్రమత్తమైంది. దేశభద్రత, సంసిద్ధతకు సంబంధించిన అంశాలను చర్చించేందుకుగానూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, జైశంకర్ తదితరులతోపాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ఢోబాల్‌, త్రివిధ దళాదిపతులు, ఇతర సీనియర్ అధికారులు ఇందులో పాల్గొన్నారు. ముఖ్యంగా రక్షణ రంగంలో ఆత్మనిర్భరతను సాధించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ సూచించినట్లు తెలుస్తోంది. తద్వారా భద్రతా వ్యవస్థను పటిష్ట పరచడంతోపాటు ఆర్థికవృద్ధిని మరింత మెరుగుపరచుకోవచ్చని స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌లోని ఖర్కివ్‌ దాడుల్లో మృతి చెందిన భారత విద్యార్థి నవీన్ శేఖరప్ప భౌతికకాయాన్ని స్వదేశానికి రప్పించేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలని ప్రధాని నరేంద్రమోదీ అధికారులను ఆదేశించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని