Bucha killings: బుచా హింసాకాండ దారుణం.. భారత్‌ది శాంతిపక్షమే

ఉక్రెయిన్‌లో బుచా పట్టణంలో చోటుచేసుకున్న మారణహోమాన్ని భారత్‌ తీవ్రంగా ఖండించింది. దీనిపై స్వతంత్ర దర్యాప్తునకు మద్దతు ఇస్తున్నట్లు పేర్కొంది.

Updated : 06 Apr 2022 16:08 IST

పార్లమెంట్‌లో విదేశాంగమంత్రి ప్రకటన

దిల్లీ: ఉక్రెయిన్‌లోని బుచా పట్టణంలో చోటుచేసుకున్న మారణహోమాన్ని భారత్‌ తీవ్రంగా ఖండించింది. దీనిపై స్వతంత్ర దర్యాప్తునకు మద్దతు ఇస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్‌ పార్లమెంట్‌లో ప్రకటన చేశారు. రక్తం చిందించడం ద్వారా ఏ సమస్యకు పరిష్కారం లభించదని వెల్లడించారు. అలాగే ఉక్రెయిన్‌ నుంచి భారత పౌరుల తరలింపు ప్రక్రియ గురించి మాట్లాడారు.

‘బుచాలో చోటుచేసుకున్న అరాచకాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది చాలా తీవ్రమైన విషయం. దీనిపై స్వతంత్ర దర్యాప్తునకు మద్దతు ఇస్తున్నాం. భారత్‌ ఒకవైపు ఎంచుకోవాల్సి వస్తే.. అది శాంతి పక్షమే అవుతుంది. అలాగే తక్షణం హింసను ముగించడం కోసమే చూస్తుంది. ఇదే మన దేశ విధానం. ఇదే విషయాన్ని అంతర్జాతీయ వేదికలపై స్పష్టంగా వెల్లడించాం’ అని మంత్రి తెలియజేశారు.

రష్యా-ఉక్రెయిన్ సంక్షోభాన్ని ఇరు దేశాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని భారత్‌ మొదట్నుంచీ చెప్తోందన్నారు. ఈ విషయంలో భారత్‌ సహకారం అవసరమనిపిస్తే.. సంతోషంగా ముందుకు వస్తుందని చెప్పారు. రక్తం చిందించడం ద్వారా, అమాయకుల ప్రాణాలు పణంగా పెట్టడం వల్ల ఏ సమస్యకు పరిష్కారం దొరకదని పార్లమెంట్‌ వేదికగా ఆ రెండు దేశాలకు సూచించారు. ప్రతి దేశమూ అంతర్జాతీయ చట్టాలను దృష్టిలో ఉంచుకోవాలన్నారు.

ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారత పౌరుల తరలింపు ప్రక్రియ అత్యంత సవాలుగా నిల్చిందని ఈ సందర్భంగా జై శంకర్ అన్నారు. నలుగురు కేంద్ర మంత్రులు ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు వెళ్లి ఉండకపోతే.. ఇంతటి సహకారం లభించి ఉండేది కాదన్నారు. కానీ ఈ విషయంలో విపక్షాలు వ్యవహరించిన తీరు దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. 

ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు సమీప పట్టణం బుచాలో ఇటీవల దాదాపు 400 మృతదేహాలను గుర్తించినట్లు.. ఆ దేశ అధికారులు వెల్లడించారు. చేతులు వెనక్కి కట్టి, తలపై కిరాతంగా కాల్చిన గుర్తులు మృతదేహాలపై ఉన్నాయి. మహిళలు, బాలికలపై లైంగిక దాడులు జరిగిన దాఖలాలున్నాయి. అలాగే భౌతికకాయాలను పూడ్చిపెట్టేందుకు తీసిన 45 అడుగుల పొడవైన గుంత శాటిలైట్ చిత్రాల ద్వారా బయటకు వచ్చింది. ఈ సందర్భంగా వెలుగులోకి వచ్చిన దృశ్యాలతో ప్రపంచం కలవరపడింది. రష్యా వైఖరిని తీవ్రంగా ఖండించింది. ఇది ఉక్రెయిన్ రెచ్చగొట్టే చర్యే అంటూ, ఆ ఆరోపణలను రష్యా తోసిపుచ్చింది.  ఇక ఈ ఘటనలపై స్వతంత్ర దర్యాప్తునకు ఐరాస భద్రతా మండలిలో భారత్ మద్దతు పలికింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని