UK: ఒమిక్రాన్‌తో బ్రిటన్‌ విలవిల.. లక్ష దాటిన రోజువారీ కేసులు

కొవిడ్‌ మహమ్మారి గుప్పిట్లో ఐరోపా దేశం బ్రిటన్‌ విలవిల్లాడుతోంది. ఓవైపు డెల్టా, మరోవైపు ఒమిక్రాన్‌ వేరియంట్లు ఆ దేశాన్ని హడలెత్తిస్తున్నాయి. దీంతో గత కొన్ని

Updated : 23 Dec 2021 11:49 IST

లండన్‌: కొవిడ్‌ మహమ్మారి గుప్పిట్లో ఐరోపా దేశం బ్రిటన్‌ విలవిల్లాడుతోంది. ఓవైపు డెల్టా, మరోవైపు ఒమిక్రాన్‌ వేరియంట్లు ఆ దేశాన్ని హడలెత్తిస్తున్నాయి. దీంతో గత కొన్ని రోజులుగా రోజువారీ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. తాజాగా రికార్డు స్థాయిలో అక్కడ లక్షకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. మహమ్మారి వెలుగులోకి వచ్చిన తర్వాత బ్రిటన్‌లో ఈ స్థాయిలో కేసులు రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

తాజాగా బ్రిటన్‌లో 24 గంటల వ్యవధిలో 1,06,122 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒమిక్రాన్‌ బాధితుల సంఖ్య 13వేలకు పైనే ఉంది. ఇక యూకేలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 69వేలు దాటినట్లు అక్కడి ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలో ఒమిక్రాన్‌ కేసులు యూకేలోనే నమోదవుతుండటంతో అధికారులు ఆందోళనకు గురవుతున్నారు.

12ఏళ్ల లోపువారికి టీకాకు అనుమతి..

మహమ్మారి ఉద్ధృతి నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో బ్రిటన్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. చిన్నారులను కరోనాబారి నుంచి రక్షించేందుకు వీలుగా 5 నుంచి 11ఏళ్ల పిల్లలకు టీకా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ అభివృద్ధి చేసిన ఫైజర్‌ టీకాను తక్కువ మోతాదులో పిల్లలకు ఇచ్చేందుకు అనుమతులు మంజూరు చేసింది. 5-11ఏళ్ల వారికి ఎనిమిది వారాల వ్యవధితో రెండు డోసులు ఇవ్వనున్నారు. ఇక దీంతో పాటు 16, 17ఏళ్ల వారికి బూస్టర్‌ డోసులను ఇచ్చే అంశంపైనా యూకే ప్రభుత్వం దృష్టిపెట్టింది. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం అక్కడ 18ఏళ్లు దాటిన వారందరికీ రెండు డోసులతో పాటు బూస్టర్‌ డోసులను కూడా పంపిణీ చేస్తున్నారు. ఇక 12-17ఏళ్ల వారికి రెండు డోసులు టీకాలను అందిస్తున్నారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని