North Korea: ‘అణు’కువగా ఉండనంటున్న కిమ్‌.. బైడెన్‌కు కొత్త తలనొప్పి..! 

ఉత్తరకొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ సమయం చూసి అమెరికాను దెబ్బకొట్టేందుకు సిద్ధమయ్యారు. ఓ పక్క అఫ్గాన్‌ పరిణామాలతో బైడెన్‌ సర్కారుకు

Published : 30 Aug 2021 16:25 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉత్తరకొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ సమయం చూసి అమెరికాను దెబ్బకొట్టేందుకు సిద్ధమయ్యారు. ఓ పక్క అఫ్గాన్‌ పరిణామాలతో బైడెన్‌ సర్కారుకు తలబొప్పి కట్టింది.. అదే సమయంలో ఉత్తర కొరియాలో కిమ్‌ సర్కారు మళ్లీ అణు కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఈ విషయాన్ని ఐరాస అటామిక్‌ ఏజెన్సీ వెల్లడించింది. తాజాగా యాంగ్‌బ్యొన్‌ అణు రియాక్టర్‌ వినియోగంలోకి తెచ్చినట్లు పేర్కొంది. ఈ రియాక్టర్‌ నుంచి అణ్వాయుధాల్లో ఉపయోగించే ఫ్లూటోనియంను ఉత్పత్తి చేయవచ్చు. అంతర్జాతీయ అణు శక్తి సంస్థను 2009 నుంచి ఇక్కడికి రాకుండా ఉత్తరకొరియా అడ్డుకొన్నా.. ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించి అక్కడి పరిస్థితులను ఆ సంస్థఅంచనా వేస్తోంది. 

ఐఏఈఏ సంస్థ ఇక్కడి ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించగా.. జులై నుంచి కూలింగ్‌ వాటర్‌ బయటకు వెళుతున్నట్లు గుర్తించింది. రియాక్టర్‌ పనిచేస్తున్న విషయాన్ని ఈ అంశం ధ్రువీకరిస్తోంది. సింగపూర్‌లో 2018లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ఉ.కొరియా అగ్రనేతతో భేటీ  జరిగిన కొన్ని నెలల్లోనే దీనిని మూసివేశారు.ఇదే కాంప్లెక్సులో ఉన్న అణు ఇంధన రీప్రాసెస్‌ ల్యాబోరేటరీ కూడా పనిచేస్తోందని ఐఏఈఏ పేర్కొంది.  ఈ ల్యాబ్‌ పనిచేయడం భవిష్యత్తులో తీవ్ర సమస్యలకు కారణమవుతుందని పేర్కొంది. ఇది ఐరాస భద్రతా మండలి తీర్మానానికి వ్యతిరేకమని వెల్లడించింది. దీనిపై దక్షిణ కొరియా విదేశాంగ శాఖ స్పందించింది. ఉత్తరకొరియా కార్యకలాపాలను నిరంతరం ఓ కంట కనిపెడుతున్నామని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని