Bridge Collapses: వరుసగా కుప్పకూలుతున్న వంతెనలు.. ఆందోళనలో ప్రజలు

Bihar: బిహార్‌లో ఇప్పటికే రెండు బ్రిడ్జిలు పేకమేడలా కూలిపోగా... తాజాగా తూర్పు చంపారన్‌ జిల్లాలో నిర్మాణదశలో ఉన్న మరో వంతెన కూలిపోయింది.

Published : 23 Jun 2024 16:23 IST

పట్నా: బిహార్‌లో (Bihar) వరుసగా వంతెనలు కుప్పకూలుతున్నాయి. ఇప్పటికే రెండు బ్రిడ్జిలు పేకమేడలా కూలిపోగా (Bridge Collapses).. తాజాగా తూర్పు చంపారన్‌ జిల్లాలో నిర్మాణ దశలో ఉన్న మరో వంతెన కూలిపోయింది. ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. వారం రోజుల వ్యవధిలో ఇది మూడో ఘటన కావడం గమనార్హం. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మోతీహరి ప్రాంతంలో రూ.1.5 కోట్ల వ్యయంతో 16 మీటర్ల వంతెనను నిర్మిస్తున్నారు. నిర్మాణ దశలో ఉన్న ఈ వంతెన కూలిపోవడానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన అధికారులు శాఖా పరమైన దర్యాప్తునకు ఆదేశించారు. కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దీపక్‌ కుమార్‌ సింగ్‌ తెలిపారు. ఈ వంతెన నిర్మాణానికి గతంలో స్థానికులు అడ్డుపడ్డారు. దీంతో వారే కూల్చేసి ఉంటారా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

గత కొన్నేళ్లుగా వాడుకలో ఉన్న సివాన్‌ జిల్లాలోని గండక్‌ కాలువపై నిర్మించిన వంతెన భారీ శబ్దంతో శనివారం కూలిపోయిన సంగతి తెలిసిందే.  దాదాపు 40 సంవత్సరాల క్రితం నిర్మించారని, సరైన నిర్వహణ లేకపోవడంతోనే వంతెన కూలిపోయిందని సమాచారం. మరోవైపు అరారియా జిల్లాలో బక్రా నదిపై రూ.కోట్లు ఖర్చుపెట్టి నిర్మించిన ఓ వంతెన ప్రారంభానికి ముందే కుప్పకూలింది. దీనికి గల కారణాలను తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. వారం రోజుల వ్యవధిలోనే రాష్ర్టంలో మూడు వంతెనలు కూలిపోవడంతో అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ ప్రమాదవశాత్తు కూలిపోయాయా? లేదా?ఎవరైనా కూల్చి వేస్తున్నారా? అనే కోణంలో అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని