బిహార్‌లో వరుస వంతెన ప్రమాదాలు.. డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వంపై తేజస్వీ విమర్శలు

బిహార్‌లో వరుస వంతెన ప్రమాదాలపై మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌ విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేశారు. 

Published : 29 Jun 2024 20:20 IST

పట్నా: బిహార్‌లో వంతెన ప్రమాదాలు కొనసాగుతున్నాయి. కొన్ని కూలిపోగా.. మరికొన్ని కుంగిపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. పది రోజుల వ్యవధిలో ఐదు వంతెనలు ప్రమాదానికి గురయ్యాయి. దీనిపై ఆర్జేడీ నేత, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌ (Tejashwi Yadav) స్పందించారు. నీతీశ్‌ సర్కార్‌తో పాటు కేంద్ర ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

‘‘బిహార్‌లోని డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వానికి అభినందనలు. ప్రభుత్వం డబుల్‌ పవర్‌తో తొమ్మిది రోజుల వ్యవధిలో ఐదు వంతెనలు కూలిపోయాయి. తమను తాము నిజాయతీపరులుగా భావించే కొందరు.. వంతెనలు కూలిపోవడం వల్ల రూ.వేల కోట్ల ప్రజాధనం నష్టపోవడాన్ని.. అవినీతి కంటే మేలైనదిగా పేర్కొంటున్నారు. అలాంటి వారు ఈ సమస్యలపై ఎందుకు పెదవి విప్పడం లేదు’’ అని ప్రశ్నించారు.

‘దీనికి నెహ్రూను నిందించొద్దు ప్లీజ్‌’.. భాజపా పోస్ట్‌ వైరల్‌

కిషన్‌గంజ్‌ జిల్లాలో కంకయీ ఉపనదిపై నిర్మించిన ఓ వంతెన ఇటీవల కుంగిపోయింది. దీంతో బహదుర్‌గంజ్‌, దిఘాల్‌బ్యాంక్‌ బ్లాక్‌ల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కంకయీ, మహానంద నదులను కలిపే మడియా ఉపనదిపై 2011లో 70 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పుతో ఈ వంతెనను నిర్మించారు. అంతకుముందు తూర్పు చంపారన్‌, సివాన్‌, అరారియా జిల్లాల్లో వంతెనలు కూలిపోయాయి. తాజాగా మధుబని జిల్లాలోని వంతెన కూలింది. ఇది రాష్ట్ర ఉత్తర దిశలోని నేపాల్‌ సరిహద్దులో ఉంది. వంతెనలు కూలిపోవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని