Unemployment allowance: యువతకు నిరుద్యోగ భృతిపై ఛత్తీస్‌గఢ్‌ సీఎం ప్రకటన

రాష్ట్రంలో యువతకు నిరుద్యోగ భృతి అంశంపై ఛత్తీస్‌గఢ్‌ సీఎం కీలక ప్రకటన చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచే భృతిని చెల్లించనున్నట్టు ప్రకటించారు.

Updated : 26 Jan 2023 20:52 IST

రాయ్‌పూర్‌: ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌(Bhupesh Baghel) కీలక ప్రకటన చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం (2023-24) నుంచి యువతకు ప్రతినెలా నిరుద్యోగ భృతి(Unemployment allowance) చెల్లించనుననట్టు వెల్లడించారు. అయితే, నెలకు ఎంత మొత్తాన్ని ఇస్తారనే అంశాన్ని మాత్రం ఆయన స్పష్టంచేయలేదు. 2018లో జరిగిన ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ ఈ హామీ ఇచ్చింది. అయితే, తాజాగా బస్తర్‌ జిల్లా జగదల్‌పూర్‌లోని లాల్‌బాగ్‌ పరేడ్‌ మైదానంలో జరిగిన రిపబ్లిక్‌ డే వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రి వచ్చే ఆర్థిక ఏడాది నుంచి నిరుద్యోగ భృతి చెల్లిస్తామని ప్రకటించడం గమనార్హం.  గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా గ్రామీణ పరిశ్రమల విధానాన్ని రూపొందించనున్నట్టు సీఎం తెలిపారు. 

పరిశ్రమల శాఖ అభివృద్ధి చేసిన పారిశ్రామిక ప్రాంతాల్లో ఉన్న ఫ్యాక్టరీలకు ఆస్తి పన్ను నుంచి మినహాయింపు కల్పిస్తామని వెల్లడించారు. రాయ్‌పూర్‌ విమానాశ్రయం సమీపంలో ఏరోసిటీ ఏర్పాటు; కార్మికులకు గృహ నిర్మాణ సహాయ పథకం, వ్యవస్థాపక రంగంలో మహిళల్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక పథకాలు అమలు చేస్తామన్నారు. వీటితో పాటు గిరిజన సంస్కృతి, పండుగలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని.. అందుకోసం వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రాష్ట్రంలోని గిరిజనుల ప్రాబల్యం ఉన్న బస్తర్, సుర్గుజా డివిజన్లు, షెడ్యూల్డ్ ప్రాంతాలలో పండుగల నిర్వహణ కోసం ప్రతి గ్రామ పంచాయతీకి ఏటా రూ.10వేలు చొప్పున సాయం అందిస్తామన్నారు. 



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు