UNGA: ఐరాసలో భారత్‌కు అరుదైన గౌరవం.. ఐఎస్‌ఏకు పరిశీలక హోదా మంజూరు

ఐరాసలో భారత్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఫ్రాన్స్‌తో కలిసి ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సౌర కూటమి(ఐఎస్‌ఏ)కి ఐరాస జనరల్ అసెంబ్లీ(యూఎన్‌జీఏ) తాజాగా పరిశీలక హోదా(అబ్జార్వర్‌ స్టేటస్‌)ను మంజూరు చేసింది. ఐరాసలో భారత శాశ్వత రాయబారి టీఎస్‌ తిరుమూర్తి...

Published : 10 Dec 2021 23:52 IST

న్యూయార్క్‌: ఐరాసలో భారత్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఫ్రాన్స్‌తో కలిసి ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్‌ఏ)కి ఐరాస జనరల్ అసెంబ్లీ (యూఎన్‌జీఏ) తాజాగా పరిశీలక హోదా (అబ్జర్వర్‌ స్టేటస్‌)ను మంజూరు చేసింది. ఐరాసలో భారత శాశ్వత రాయబారి టీఎస్‌ తిరుమూర్తి ఈ విషయాన్ని వెల్లడించారు. భాగస్వామ్యాల ద్వారా స్వల్ప వ్యవధిలోనే సానుకూల విధానాలను ఎలా ముందుకు తీసుకెళ్లవచ్చో అనే దానికి ఐఎస్‌ఏ ఒక ఉదాహరణగా నిలుస్తోందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ సైతం ఈ మేరకు శుక్రవారం ట్వీట్‌ చేశారు. సుస్థిర ప్రపంచం కోసం భారత్‌ చేస్తున్న ప్రయత్నాలకు ప్రపంచవ్యాప్త మద్దతుకు ఇది సంకేతమని పేర్కొన్నారు.

వాతావరణ మార్పుల సవాళ్లను ఎదుర్కోవడంలో భాగంగా సౌరశక్తి ఉత్పాదకతను ప్రోత్సహించేందుకు భారత్‌, ఫ్రాన్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఐఎస్‌ఏ రూపుదిద్దుకుంది. 2015లో పారిస్‌లో జరిగిన కాప్‌21 సదస్సులో దీన్ని ప్రవేశపెట్టారు. ఐఎస్‌ఏకి పరిశీలక హోదా ద్వారా.. కూటమికి, ఐరాసకు మధ్య క్రమబద్ధమైన సమన్వయం సాధ్యపడుతుంది. తద్వారా ప్రపంచ ఇంధన రంగం అభివృద్ధికి ప్రయోజనం చేకూరుతుంది. అధికారిక వివరాల ప్రకారం.. ఇప్పటివరకు మొత్తం 80 దేశాలు ఐఎస్‌ఏ ఫ్రేమ్‌వర్క్ ఒప్పందంపై సంతకం చేసి, ఆమోదించాయి. 101 దేశాలు కేవలం సంతకం మాత్రమే చేశాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని