Union Budget: 23న కేంద్ర బడ్జెట్‌

పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ఈనెల 22 నుంచి ఆగస్టు 12 వరకు జరగనున్నాయి. 23న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

Published : 07 Jul 2024 04:53 IST

22 నుంచి ఆగస్టు 12 వరకు పార్లమెంటు సమావేశాలు

ఈనాడు, దిల్లీ: పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ఈనెల 22 నుంచి ఆగస్టు 12 వరకు జరగనున్నాయి. 23న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. 22న ఆర్థిక సర్వేను సభకు సమర్పిస్తారు. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు ‘ఎక్స్‌’ ద్వారా వెల్లడించారు. బడ్జెట్‌ సమావేశాల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శనివారం ఆమోదముద్ర వేసినట్లు చెప్పారు. నిర్మలా సీతారామన్‌ వరుసగా ఏడోసారి బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నారు. గతంలో సి.డి.దేశ్‌ముఖ్‌ మాత్రమే ఇన్నిసార్లు వరుసగా బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. సంఖ్యాపరంగా అత్యధికంగా (పదిసార్లు) బడ్జెట్‌ ప్రవేశపెట్టిన మొరార్జీ దేశాయ్‌ పేరు మీద ఉంది. నిర్మలా సీతారామన్‌.. 2019 మే 30 నుంచి ఆర్థికమంత్రిగా కొనసాగుతున్నారు. అదే ఏడాది మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆమె తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. తర్వాత వరుసగా 2020-21, 2021-22, 2022-23, 2023-24 బడ్జెట్‌లు అందించారు. ఈ ఏడాది ఎన్నికల సంవత్సరం కావడంతో ఫిబ్రవరి 1న 2024-25కి సంబంధించిన ఓటాన్‌ అకౌంట్‌ ప్రవేశపెట్టారు. ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఆరుసార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రిగా మొరార్జీ దేశాయ్‌ పేరు మీదున్న రికార్డును నిర్మల చెరిపేయనున్నారు. భారత్‌ను ప్రపంచదేశాలతో పోటీపడేలా ముందుకు నడిపించడమే ఈ దఫా తన లక్ష్యమని ప్రధాని మోదీ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో కొత్త బడ్జెట్‌పై అనేక వర్గాల్లో ఆసక్తి వ్యక్తమవుతోంది. 

గతంతో పోలిస్తే ప్రస్తుతం ప్రతిపక్షాల బలం పెరిగినందున వచ్చే సమావేశాలు మరింత అలజడితో సాగే సూచనలు కనిపిస్తున్నాయి. రాహుల్‌గాంధీ లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టిన అనంతరం కాంగ్రెస్‌ కొంత దూకుడుగా వ్యవహరించడం మొదలుపెట్టింది. గతనెల 24 నుంచి ఈ నెల 3వరకు జరిగిన తొలి సమావేశాల్లో నీట్, మణిపుర్, ఎమర్జెన్సీకి 50 ఏళ్లు పూర్తవడం, అగ్నిపథ్‌ స్కీం అంశాలు అధికార, విపక్షాల మధ్య అగ్గిరాజేశాయి. నీట్‌పై పార్లమెంటు చివరి రోజు చర్చకు అనుమతివ్వాలని రాహుల్‌గాంధీ రాసిన లేఖను పరిగణనలోకి తీసుకోకుండా స్పీకర్‌ ఓం బిర్లా లోక్‌సభను వాయిదా వేసేశారు. ఈ నేపథ్యంలో వచ్చే బడ్జెట్‌ సమావేశాల్లో ప్రతిపక్షం తన పంతం నెగ్గించుకొనేందుకు మరింత దూకుడుగా వ్యవహరించే సూచనలు కనిపిస్తున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని