MSP: వరికి మరో రూ.117 మద్దతు

కేంద్ర ప్రభుత్వం 2024-25 ఖరీఫ్‌ మార్కెటింగ్‌ సీజన్‌కు సంబంధించి 14 పంటల కనీస మద్దతు ధరను పెంచింది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వరి కనీస మద్దతు ధరను క్వింటాలుకు రూ.117 పెంచారు.

Published : 20 Jun 2024 06:25 IST

ఖరీఫ్‌లో క్వింటాలు రూ.2,300
కందులపై రూ.550 పెంపు
రూ.76,200 కోట్లతో వధావన్‌ ఓడరేవు 
వారణాసి విమానాశ్రయ అభివృద్ధికి రూ.2,869 కోట్లు
కేంద్ర మంత్రివర్గం నిర్ణయాలు 

ఈనాడు, దిల్లీ: కేంద్ర ప్రభుత్వం 2024-25 ఖరీఫ్‌ మార్కెటింగ్‌ సీజన్‌కు సంబంధించి 14 పంటల కనీస మద్దతు ధరను పెంచింది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వరి కనీస మద్దతు ధరను క్వింటాలుకు రూ.117 పెంచారు. అత్యధికంగా వలిశలు ధర రూ.983, నువ్వులు రూ.632, కందులు రూ.550 మేర పెరిగాయి. తాజా పెంపుతో రైతులకు సజ్జలపై 77%, కందిపై 59%, మొక్కజొన్నపై 54%, మినుములపై 52%, మిగిలిన అన్ని పంటలపై 50% అదనపు ఆదాయం వస్తుందని కేంద్రం తెలిపింది. పంటల సాగు ఖర్చుకు ఒకటిన్నర రెట్ల ఎక్కువ ఆదాయం రైతుకు అందాలన్న విధానానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. 2003-04 నుంచి 2013-14 మధ్యకాలంలో కనిష్ఠంగా సజ్జలు(రూ.745), గరిష్ఠంగా మినుముల (రూ.3,130) ధర పెరిగింది. 2013-14 నుంచి 2023-24 మధ్య కనిష్ఠంగా మొక్కజొన్న (రూ.780), గరిష్ఠంగా వలిశల (గడ్డి నువ్వులు-నైగర్‌ సీడ్‌) ధర (రూ.4,234) పెరిగినట్లు తెలిపింది.ఈ పెంపుతో మునుపటి సీజన్‌ కంటే ఈసారి రూ.35,000 కోట్ల అదనపు భారం ఖజానాపై పడుతుంది. 

మహారాష్ట్రలో భారీ ఓడరేవు

మహారాష్ట్రలోని వధావన్‌లో రూ.72వేల కోట్లతో భారీ ఓడరేవు నిర్మించాలని క్యాబినెట్‌ నిర్ణయించింది. భూసేకరణతో కలిపి దీనికి రూ.76,220 కోట్లు అవుతుందని అంచనా. ప్రపంచంలో పది అతిపెద్ద రేవుల్లో ఒకటిగా ఇది రూపొందుతుంది. 

  • గుజరాత్, తమిళనాడుల్లోని సముద్ర తీరాల్లో ఒక్కొక్కటి 500 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేయబోయే రూ.7,453 కోట్ల పవన విద్యుత్తు ప్రాజెక్టులకు వ్యయ సర్దుబాటు నిధి (వయబిలిటీ గ్యాప్‌ ఫండ్‌) సమకూర్చడానికి క్యాబినెట్‌ ఆమోదించింది. 
  • వారణాసిలో రూ.2,869.65 కోట్లతో లాల్‌బహదూర్‌ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయం ఆధునికీకరణకూ పచ్చజెండా ఊపింది. 

ఫోరెన్సిక్‌ వసతులకు రూ.2,254 కోట్లు 

దేశవ్యాప్తంగా ఉన్న ఫోరెన్సిక్‌ సదుపాయాలను రూ.2,254 కోట్లతో మెరుగుపరుస్తారు. నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ ప్రాంగణాలు, ప్రయోగశాలలు ఏర్పాటు చేస్తారు. దిల్లీలోని ఫోరెన్సిక్‌ విశ్వవిద్యాలయంలో ఇప్పుడున్న మౌలిక వసతులను ఆధునికీకరిస్తారు. జులై 1 నుంచి కొత్త నేరన్యాయ చట్టాలు అమల్లోకి వస్తున్న నేపథ్యంలో ఫోరెన్సిక్‌ సాక్ష్యాధారాల సేకరణకు అవసరమైన మానవ వనరుల తయారీ కోసం ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. ఈ రంగంలో మానవ వనరుల కొరత తీరడానికి, ప్రస్తుత ప్రయోగశాలలపై పనిఒత్తిడి తగ్గి కేసుల సత్వర పరిష్కారానికి వీలుంటుందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పేర్కొన్నారు.


రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సులకు విలువేదీ?  

కేంద్రం నిర్ణయంపై రైతుల్లో నిరాశ

ఈనాడు, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం వానాకాలం సీజన్‌కు 14 పంటలకు ప్రకటించిన మద్దతు ధరలు అన్నదాతలకు నిరాశ మిగిల్చాయి. పెరిగిన సాగు ఖర్చులకు అనుగుణంగా మద్దతు ధరలు భారీగా ఉంటాయని ఆశిస్తే నిరాశే మిగిలిందని వారు వాపోతున్నారు. రాష్ట్రాల నుంచి అభిప్రాయాలు తీసుకోవడంతోపాటు పంటలకయ్యే వ్యయాలను పరిగణనలోకి తీసుకొని జాతీయ వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్‌(సీఏసీపీ‡) సిఫార్సు చేస్తే కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయం తీసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చులను అంచనా వేసి కమిషన్‌కు నివేదించినా అది అమలు కావడం లేదు. రాష్ట్రంలో వరి సాధారణ రకానికి రూ.3,000, ఏ-గ్రేడ్‌ రకానికి రూ.3,200 మద్దతు ధర ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసింది. కానీ కేంద్రం వరి సాధారణ రకానికి రూ.2,300, ఏ-గ్రేడ్‌ రకానికి రూ.2,320 మాత్రమే ప్రకటించింది. మరోవైపు పత్తికి రూ.వేయి నుంచి రూ.1,500 పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. కేంద్రం మధ్యరకానికి రూ.7,121, లాంగ్‌ స్టేపుల్‌కు రూ.7,521 ధర ఖరారు చేసింది. అంటే పెంపు నిరుటి కంటే రూ.500 మాత్రమే అధికం. జొన్నకు రూ.3,500 కోరగా.. హైబ్రిడ్‌ రకానికి రూ.3,371 ధర ప్రకటించింది. మొక్కజొన్నకు రూ.2,500 కోరగా రూ.2,225, వేరుసెనగకు రూ.7,200 ఇవ్వాలనగా రూ.6,783 కేంద్రం ఖరారు చేసింది. కందులకు రూ.8,000 కోరితే రూ.7,550 మాత్రమే ప్రకటించింది. పొద్దుతిరుగుడు, నువ్వులు, సోయా, పెసలు, మినుములు- పలు నూనె గింజలు, పప్పు ధాన్యాలకు సైతం రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సులకు అనుగుణంగా ధరలు పెరగలేదు. తెలంగాణలో పండించిన పంటలకు మార్కెట్‌ యార్డుల్లో మంచి ధరలు వస్తున్నాయి. వాటితో పోలిస్తే కేంద్రం ప్రకటించిన ధరలు తక్కువగా ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని