
Union Cabinet: ఎంపీ ల్యాడ్స్ పునరుద్ధరణకు కేంద్ర కేబినెట్ నిర్ణయం
దిల్లీ: పార్లమెంట్ సభ్యుల స్థానిక అభివృద్ధి నిధుల పథకాన్ని (ఎంపీ ల్యాడ్స్) పునరుద్ధరించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. కొవిడ్-19 కారణంగా ఈ పథకాన్ని తాత్కాలికంగా నిలిపివేసిన కేంద్రం.. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మిగిలిన కాలానికి నిధులు విడుదల చేసేందుకు ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ నేతృత్వంలో బుధవారం కేబినెట్ సమావేశం జరిగింది. అనంతరం కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కేబినెట్ సమావేశ వివరాలను వెల్లడించారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలిన కాలానికి ఒక్కో ఎంపీకి రూ.2 కోట్లు చొప్పున ఏకమొత్తంలో ఎంపీ ల్యాడ్స్ నిధులు ఇవ్వనున్నట్లు అనురాగ్ ఠాకూర్ తెలిపారు. 2025-26 వరకు ఈ పథకం కొనసాగుతుందని చెప్పారు. ప్రస్తుతం ఏడాదికి రూ.5 కోట్లను రెండు విడతల్లో రూ.2.5 కోట్లు చొప్పున అందిస్తున్నామని పేర్కొన్నారు. కొవిడ్-19 విజృంభణ నేపథ్యంలో వైద్య మౌలిక సదుపాయాల కల్పనకు ఎంపీ ల్యాడ్స్ వినియోగించేందుకు గతేడాది ఏప్రిల్‌లో కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే.
ఇథనాల్ లీటర్‌కు రూ.1.47 పెంపు
పెట్రోల్‌లో కలిపేందుకు వినియోగించే ఇథనాల్‌కు చెల్లించే ధరను కేంద్ర కేబినెట్ పెంచింది. చెరకు నుంచి తీసిన ఇథనాల్‌కు రూ.1.47 చొప్పున అదనంగా చెల్లించాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రస్తుతం చెరకు నుంచి తీసిన ఇథనాల్‌కు లీటర్‌కు రూ.62.65 చెల్లిస్తుండగా.. ఇకపై రూ.63.45 చెల్లించనున్నారు. ఈ ఏడాది డిసెంబర్ నుంచి పెంచిన ధర అమల్లోకి రానుంది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఈ మొత్తానికే ఇథనాల్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం పెట్రోల్‌లో ఇథనాల్‌ను 8 శాతం మేర కలుపుతున్నామని, వచ్చే ఏడాదికి ఇది 10 శాతానికి చేరుకుంటుందని తెలిపారు. 2025 నాటికి 20 శాతం మేర ఇథనాల్‌ను పెట్రోల్‌లో కలిపేందుకు కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇథనాల్ మిక్సింగ్ వల్ల ఇటు చమురు దిగుమతులపై ఆధారపడటం తగ్గడంతో పాటు చెరకు రైతులు, చెరకు మిల్లులకు మేలు చేకూరుతుంది.