OPS: పాత పెన్షన్‌ విధానం పునరుద్ధరణపై కేంద్రం క్లారిటీ

పాత పెన్షన్‌ విధానాన్ని తిరిగి అమలు చేయడంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. అలాంటి ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో లేవని తేల్చి చెప్పింది.

Published : 12 Dec 2022 22:26 IST

దిల్లీ: పాత పెన్షన్‌ విధానం (OPS)పునరుద్ధరణపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. వివిధ రాష్ట్రాలు ఓపీఎస్‌ను తిరిగి అమలు చేస్తామని హామీలు ఇస్తున్న నేపథ్యంలో కేంద్రం(Central Govt) తన వైఖరిని స్పష్టం చేసింది. ఓపీఎస్‌ విధానాన్ని తిరిగి తీసుకొచ్చే ఆలోచన లేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్‌ కరాద్‌ లోక్‌సభకు తెలిపారు. ఈ మేరకు ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌,ఝార్ఖండ్ రాష్ట్రాల ఎంపీలు అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. ఓపీఎస్‌ అమలు చేస్తే.. ఒక ఉద్యోగి పదవీవిరమణ చేసిన సమయానికి పొందుతున్న  నెలజీతంలో యాభై శాతం మొత్తాన్ని పెన్షన్‌ (pension)గా ఇవ్వాల్సి ఉంటుంది.

పంజాబ్‌ (Punjab)లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఓపీఎస్‌ విధానాన్ని వర్తింపజేసేందుకు నవంబరు 18న అక్కడి ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. నూతన పెన్షన్‌ విధానంలో ఉన్నవారికి కూడా ఇది వర్తించేలా చేస్తామని అక్కడి ఆప్‌ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌ ప్రభుత్వాలు కూడా నేషనల్ పెన్షన్‌ సిస్టమ్‌ (ఎన్‌పీఎస్‌) నిబంధనల ప్రకారం కేంద్రం నుంచి రావాల్సిన నిధులను ఇవ్వాలని కోరాయి. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి.. కేంద్రం నుంచి నిధులు కావాలని  పంజాబ్‌ ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలేమీ రాలేదని, ఒకవేళ ఓపీఎస్‌ను అమలు చేయాలను కుంటే అది రాష్ట్ర ప్రభుత్వాలే చూసుకోవాలని వివరణ ఇచ్చారు. మరోవైపు ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా కేంద్రం తీసుకొచ్చిన ఎమర్జెన్సీ క్రెడిట్‌ లైన్‌ గ్యారెంటీ స్కీమ్‌ (ఈజీఎల్‌జీఎస్‌)లో భాగంగా 1.19 కోట్ల మంది లబ్ధిపొందారని, నవంబరు 30 వరకు రూ.3.58 లక్షల కోట్లను అప్పుగా పొందారని కేంద్ర మంత్రి వివరించారు. మరోవైపు సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి రూ.50కోట్ల వరకు రుణాలు ఇస్తున్నట్లు ఆయన చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని