ఇకపై OTTలోనూ పొగాకు వ్యతిరేక హెచ్చరికలు.. కేంద్రం కీలక నిర్ణయం

ఇకపై ఓటీటీలోనూ పొగాకు వ్యతిరేక హెచ్చరికలు (anti tobacco warnings) తప్పనిసరి చేయాలని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు నేడు ఉత్తర్వులు జారీ చేసింది.

Updated : 31 May 2023 17:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం (World No-tobacco Day) సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ఓటీటీ (OTT)లోనూ పొగాకు వ్యతిరేక హెచ్చరికలు (anti tobacco warnings) తప్పనిసరి చేయాలని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం ఓ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే.. సదరు పబ్లిషర్‌పై తీవ్ర చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరించింది.

సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులపై ప్రచారాన్ని నిషేధించిన 2004నాటి చట్టంలో నిబంధనలను సవరిస్తూ కేంద్ర ఆరోగ్యశాఖ (Health Ministry) నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీని ప్రకారం.. ఓటీటీ (OTT) మాధ్యమాల్లో ప్రదర్శించే వెబ్‌ సిరీసులు, సినిమాలు, ఇతర వినోద కార్యక్రమాల్లో పొగాకు వినియోగానికి సంబంధించిన దృశ్యాలుంటే ఇకపై హెచ్చరికలు జారీ చేయాలని కేంద్రం స్పష్టం చేసింది. ‘పొగాకు వినియోగం క్యాన్సర్‌ కారకం, పొగాకు వినియోగం ప్రాణాంతకం’ అని సినిమా థియేటర్లు, టీవీల్లో ప్రదర్శించినట్లుగానే ఓటీటీల్లోనూ కార్యక్రమం ప్రారంభానికి ముందు, మధ్యలో కనీసం 30 సెకన్ల పాటు పొగాకు దుష్ప్రభావాన్ని వివరించేలా ప్రకటన (anti tobacco warnings)ను ప్రదర్శించాలని తెలిపింది.

దీంతోపాటు పొగాకు ఉత్పత్తులను (Tobacco Products), వాటి వినియోగాన్ని చూపే దృశ్యాలు వచ్చినప్పుడు డిస్‌క్లెయిమర్‌ను చూపించాలని పేర్కొంది. ఈ సందేశం కూడా నిబంధనలకు అనుగుణంగా.. తెలుపు బ్యాక్‌గ్రౌండ్‌లో నలుపు రంగులో ఉండాలని పేర్కొంది. అంతేగాక, ఈ హెచ్చరికల ప్రకటనలు ఓటీటీ కంటెంట్‌ ప్రసారమయ్యే భాషలోనే ఉండాలని స్పష్టం చేసింది.

ఓటీటీ (OTT Platforms)ల్లో ప్రదర్శితమవుతున్న వెబ్‌ సిరీసులు, సినిమాల్లో పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని విచ్చలవిడిగా చూపుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కేంద్ర సమాచార, ప్రసార శాఖతో చర్చలు జరిపిన తర్వాతే ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేసినట్లు ఆరోగ్యశాఖ సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే.. ఆరోగ్యశాఖ, సమాచార ప్రసార శాఖ, ఐటీ శాఖ ప్రతినిధులు దీనిపై చర్యలు తీసుకుంటారని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. సదరు పబ్లిషర్‌ను గుర్తించి నోటీసులు జారీ చేస్తామని వెల్లడించారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు