Ajay Mishra: భారీ భద్రత నడుమ వెళ్లి ఓటేసిన కేంద్రమంత్రి అజయ్‌ మిశ్రా

ఉత్తర్‌ప్రదేశ్‌లో నాలుగో విడత పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. సామాన్య ప్రజలతో పాటు పలువురు ప్రముఖులు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు.....

Published : 23 Feb 2022 16:20 IST

లఖింపుర్‌ ఖేరి: ఉత్తర్‌ప్రదేశ్‌లో నాలుగో విడత పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. సామాన్య ప్రజలతో పాటు పలువురు ప్రముఖులు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. నిఘాసన్‌ అసెంబ్లీ నియోజకవర్గంలోని లఖింపుర్‌ ఖేరిలో భాజపా ముఖ్య నేత, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్‌ మిశ్రా భారీ భద్రత మధ్య పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలీసులు, పారామిలటరీ బలగాల భద్రత నడుమ లఖింపుర్‌ ఖేరిలోని భన్వారిపూర్‌లో ఓ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రానికి ఉదయం 11.30గంటల సమయంలో ఆయన వెళ్లి ఓటేశారు. పోలింగ్‌ కేంద్రానికి వెళ్లినప్పుడు గానీ.. తిరిగి వచ్చినప్పుడు గానీ ఆయన మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. లఖింపుర్‌ ఖేరి హింసాత్మక ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న తన కుమారుడికి సంబంధించి విలేకర్లు ప్రశ్నించగా.. విజయ సంకేతం చూపుతూ కేంద్రమంత్రి ముందుకు సాగిపోయారు. కేంద్రమంత్రి అజయ్‌ మిశ్రా భారీ భద్రత మధ్య పోలింగ్‌ కేంద్రానికి వచ్చిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. మరోవైపు, ఉత్తర్‌ప్రదేశ్‌లో నాలుగో విడతలో తొమ్మిది జిల్లాల్లోని 59 నియోజకవర్గాల పరిధిలో మధ్యాహ్నం 1గంట వరకు 37.45శాతం పోలింగ్‌ నమోదైనట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది. సాయంత్రం 6గంటల వరకు పోలింగ్‌ కొనసాగుతుందని తెలిపింది.

గతేడాది అక్టోబర్‌లో ఉత్తరప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరిలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులపైకి కారు దూసుకెళ్లిన ఘటనలో కేంద్రమంత్రి తనయుడు ఆశిష్‌ మిశ్రా ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఆ ఘటనలో నలుగురు రైతులు మృతిచెందడంతో పాటు అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలో మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దాంతో ఆ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ కేసులో ప్రధాన నిందితుడిగా ఆశిష్‌ మిశ్రాను పేర్కొన్న పోలీసులు.. అక్టోబర్‌ 9న ఆయన్ను అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో అరెస్టయిన అశిష్‌ మిశ్రాకు అలహాబాద్‌ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో.. గతవారం విడుదలైన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు