మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించండి..!

మహారాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌పై ముంబయి నగర మాజీ పోలీస్‌ కమిషనర్‌ పరమ్‌బీర్‌ సింగ్‌ చేసిన ఆరోపణలు, సచిన్‌ వాజే ఎపిసోడ్‌ నేపథ్యంలో అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రమంత్రి రాందాస్‌ అఠవాలే డిమాండ్‌ చేశారు.

Published : 26 Mar 2021 01:26 IST

రాష్ట్రపతిని కోరిన కేంద్ర మంత్రి అఠవాలే

ముంబయి: మహారాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌పై ముంబయి నగర మాజీ పోలీస్‌ కమిషనర్‌ పరమ్‌బీర్‌ సింగ్‌ చేసిన ఆరోపణలు, సచిన్‌ వాజే ఎపిసోడ్‌ నేపథ్యంలో అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రమంత్రి రాందాస్‌ అఠవాలే డిమాండ్‌ చేశారు. ఈ విషయంపై రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ను కలిసి విజ్ఞాపన పత్రాన్ని అందించినట్లు ఆయన వెల్లడించారు.

‘మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్రపతి కోవింద్‌ గారికి విజ్ఞాపన పత్రాన్ని అందించాను. నా డిమాండ్‌పై ఆలోచిస్తానని రాష్ట్రపతి నాతో చెప్పారు’ అని కేంద్ర సామాజికన్యాయ శాఖ సహాయ మంత్రి రాందాస్‌ అఠవాలే వెల్లడించారు. ముకేశ్‌ అంబానీ నివాసం సమీపంలో పేలుడు పదార్థాలతో కూడిన వాహనంతో పోలీస్‌ ఉన్నతాధికారి సంబంధం ఉండడం, నెలకు రూ.వంద కోట్లు వసూలు చేయాలని రాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ పోలీసులకు టార్గెట్‌ పెట్టడం వంటి విషయాలు చాలా తీవ్రమైనవని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో హోంమంత్రిపై దర్యాప్తు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇదే విషయంపై రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా తరపున రాష్ట్రపతిని కోరానని రాందాస్‌ అఠవాలే పేర్కొన్నారు. ఇక మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలని భాజపా కూడా డిమాండ్‌ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ సారథ్యంలో భాజపా  ప్రతినిధివర్గం ఇప్పటికే మహారాష్ట్ర గవర్నర్‌ను కలిసి విజ్ఞప్తి చేసింది.

సోనియా గాంధీని కలిసిన ఎంపీ సుప్రియా సూలే..

మహారాష్ట్రలో హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌పై వచ్చిన ఆరోపణలతో ఇరుకున పడిన ‘మహా వికాస్‌ అగాఢీ’ వీటి నుంచి బయటపడే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే నష్ట నివారణ చర్యలు చేపట్టిన కూటమి నేతలు వరుసగా భేటీ అవుతున్నారు. తాజాగా ఎన్‌సీపీ ఎంపీ సుప్రియా సూలే కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసి రాష్ట్రంలోని తాజా పరిస్థితిని వివరించారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ తనకు పలు కీలక సూచనలు చేసినట్లు ఎంపీ సుప్రియా సూలే ట్విటర్‌లో వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని