Bihar: మద్యంపై నోరుజారి.. సీఎంను ఇరకాటంలో పెట్టిన కేంద్రమంత్రి..

బీహార్‌లో మద్యం సులభంగా దొరుకుతుందంటూ నోరుజారి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ను ఇరకాటంలో పెట్టారు కేంద్ర మంత్రి, రాష్ట్రీయ లోక్‌ జనశక్తి పార్టీ జాతీయ అధ్యక్షుడు పశుపతి పరాస్‌.

Published : 20 Apr 2022 01:21 IST

పట్నా: బీహార్‌లో మద్యం సులభంగా దొరుకుతుందంటూ నోరుజారి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ను ఇరకాటంలో పెట్టారు కేంద్ర మంత్రి, రాష్ట్రీయ లోక్‌ జనశక్తి పార్టీ జాతీయ అధ్యక్షుడు పశుపతి పరాస్‌. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో మద్యం విక్రయాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని, ఈ వాస్తవాన్ని ఎవరూ కాదనలేరని అన్నారు. దీంతో ఆ రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలవుతున్న తీరులోని వాస్తవికతను ఎత్తిచూపినట్లు అయ్యింది. ఈ చట్టానికి సంబంధించి ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘బీహార్‌లో మద్యం దొరకదని ఎవరు చెప్పారు.. రాష్ట్రంలో అది తేలికగా దొరకుతుంది’ అని అన్నారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోకి మద్యం అక్రమంగా రవాణా అవుతుందని..అందుకే నిత్యం భారీగా మద్యం పట్టుకుంటున్నారని చెప్పారు. అలా అక్రమంగా సరఫరా చేసే వారిని అరెస్టు చేస్తున్నారన్నారు. కల్తీ మద్యం తయారుచేసి విక్రయిస్తున్న మద్యం మాఫియాపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారని ఆయన తెలిపారు. మద్యపాన నిషేధిత చట్టం రాష్ట్రం ప్రయోజనాల కోసమే అమలవుతుందని పరాస్‌ వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని