మాతృభాషలో రాయలేకపోయిన కేంద్రమంత్రి.. కాంగ్రెస్‌ తీవ్ర విమర్శలు

ఒక కేంద్రమంత్రి హిందీలో ఒక పదాన్ని తప్పుగా రాయడంపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది. భాజపా మాత్రం వాటిని ఖండించింది. 

Updated : 19 Jun 2024 17:33 IST

దిల్లీ: ఒక మహిళా కేంద్రమంత్రి పాపులర్ నినాదం ‘బేటీ బచావో, బేటీ పడావో’ను సరిగా రాయలేకపోయారు. ఆ స్థాయి నేత మాతృభాషలో ఈ పదాన్ని తప్పుగా రాయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

సావిత్రి ఠాకుర్‌.. మధ్యప్రదేశ్‌లోని ధార్‌ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. కేంద్రమహిశా శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో మంగళవారం నిర్వహించిన ‘స్కూల్‌ ఛలో అభియాన్’ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ సందర్భంగా ‘బేటీ బచావో, బేటీ పడావో’ నినాదాన్ని ఒక బోర్డుపై రాశారు. అయితే దానిని సరిగా రాయలేకపోయారు. దానికి సంబంధించిన వీడియోలు వెలుగులోకి రావడంతో ఆమెపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ‘‘రాజ్యాంగ పదవుల్లో ఉండి, అతిపెద్ద మంత్రిత్వ శాఖ బాధ్యతలు చూసుకుంటూ.. కనీసం మాతృభాషలో కూడా రాయలేకపోవడం శోచనీయం. అలాంటి వ్యక్తి తన మంత్రిత్వ శాఖను ఎలా నిర్వహిస్తారో..?’’ అని కాంగ్రెస్ నేత కేకే మిశ్రా ఆందోళన వ్యక్తంచేశారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు కనీస విద్యార్హతలు ఉండేలా రాజ్యాంగంలో మార్పులు చేయాలని సూచించారు. అయితే ఈ విమర్శలను భాజపా ఖండించింది. అది హడావుడిలో జరిగిన పొరపాటని, ఆదివాసీ మహిళా ప్రతినిధి అని కూడా చూడకుండా కాంగ్రెస్ అనవసరపు రాద్ధాంతం చేస్తోందని మండిపడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని