BharOS: స్వదేశీ OS ఆవిష్కరణ.. ‘భారోస్‌’తో కేంద్రమంత్రుల తొలి వీడియోకాల్‌

స్వదేశీ మొబైల్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ భారోస్‌ (BharOS)ను కేంద్రమంత్రులు నేడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈ ఓఎస్‌తో నడిచే మొబైల్‌ నుంచి తొలి వీడియోకాల్‌ చేసి పరీక్షించారు.

Published : 24 Jan 2023 20:30 IST

దిల్లీ: ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ల గుత్తాధిపత్యాన్ని నిలువరించేందుకు భారత్‌ మొదలుపెట్టిన కసరత్తులకు కీలక ముందడుగు పడింది. ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌’లో ఐఐటీ మద్రాస్‌ (IIT Madras) తొలి స్వదేశీ మొబైల్‌ ఓఎస్‌ (OS)ను రూపొందించింది. ‘భారోస్‌ (BharOS)’ పేరుతో అభివృద్ధి చేసిన ఈ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రదాన్‌, అశ్వినీ వైష్ణవ్‌ నేడు ఆవిష్కరించారు. అనంతరం ఈ ఓఎస్‌ను మంత్రులు విజయవంతంగా పరీక్షించారు.

ఈ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ (Operating System)తో పనిచేసే మొబైల్‌ నుంచి కేంద్రమంత్రులు.. ఐఐటీ తిరుపతి డైరెక్టర్‌కు వీడియో కాల్‌ చేసి మాట్లాడారు. ఇందుకు సంబంధించిన వీడియోను కేంద్ర సమాచార, ఐటీశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ (Dharmendra Pradhan) తన ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రధాని మోదీ పిలుపునిచ్చిన ఆత్మనిర్భర్‌ భారత్‌కు ఇది కీలక ముందడుగు. ఎనిమిదేళ్ల క్రితం ఆయన డిజిటల్‌ ఇండియా గురించి మాట్లాడినప్పుడు చాలా మంది విశ్వసించలేదు. కానీ ఇప్పుడు, ఆయన దృక్పథం నిజమని దేశ ప్రజలు నమ్ముతున్నారు’’ అని తెలిపారు.

ఇదీ చదవండి: దేశీయ మొబైల్‌ ఓఎస్‌ ‘భారోస్‌’ ఫీచర్లివే..!

కొత్త పేరు సూచించిన వైష్ణవ్‌..

అనంతరం కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ మాట్లాడుతూ.. ‘‘ఇప్పటి నుంచే అసలైన సవాళ్లు ఎదురవుతాయి. ఇలాంటి వ్యవస్థ విజయవంతం కాకూడదని చాలా మంది కోరుకుంటారు. అందుకోసం అనేక సవాళ్లను తీసుకొస్తారు. ఈ ప్రయాణంలో మనం మరింత జాగ్రత్తగా ఉండాలి’’ అని సూచించారు. ఈ సందర్భంగా స్వదేశీ ఆపరేటింగ్‌ సిస్టమ్‌కు ఓ కొత్త పేరును కూడా ఆయన సూచించారు. ‘‘నాదో చిన్న సలహా. పేరుకు చాలా విలువ ఉంటుంది. ఇప్పుడున్న పేరుకు చివర్లో ఒక ‘a’ అక్షరాన్ని చేర్చితే.. అప్పుడు ప్రజలకు ‘BharOSa (భరోసా)’ ఇచ్చినవారవుతారు’’ అని అశ్వినీ వైష్ణవ్‌ (Ashwini Vaishnaw) వెల్లడించారు.

భారోస్‌ (BharOS) ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను ఐఐటీ మద్రాస్‌ (IIT Madras), జండ్‌కాప్స్‌ సంస్థ (JandK Operations Private Limited) సంయుక్తంగా ఈ  రూపొందించాయి. ఈ ఓఎస్‌ను ప్రస్తుతానికి ఎంపిక చేసిన సంస్థలకే ఇవ్వనున్నారు. ఆ తర్వాత ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. వినియోగదారుల సమాచారం భద్రంగా ఉండేలా, సౌకర్యంగా వినియోగించుకునేలా దీన్ని అభివృద్ధి చేశారు. ఇందులో  ఎలాంటి డీఫాల్ట్‌ యాప్‌లు ఉండవు. యూజర్‌ తనకు నచ్చిన, రోజువారీ అవసరాలకు ఉపయోగపడే యాప్‌లను ఎంపిక చేసుకుని ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. దీంతో ఫోన్‌ మెమొరీపై తక్కువ భారం పడనుంది.


Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు