
Kazakhstan: కజకస్థాన్‌లో హింసాత్మకంగా నిరసనలు.. పోలీసుల కాల్పుల్లో పలువురి మృతి
నూర్ సుల్తాన్: కజకస్థాన్‌లో ఎల్పీజీ ధరల పెంపుపై ఒక్కసారిగా పెల్లుబికిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. స్థానికంగా దిగజారిన పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని అస్కర్ మామిన్ నేతృత్వంలోని మంత్రివర్గం రాజీనామా చేసినా.. పరిస్థితులు అదుపులోకి రాలేదు. ఇదే క్రమంలో బుధవారం రాత్రి దేశంలోని అతిపెద్ద నగరమైన అల్మాటీలో ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలు, పోలీసు కమిషనరేట్లపై దాడికి యత్నించిన నిరసనకారులపై జరిపిన కాల్పుల్లో పలువురు మృతి చెందారని పోలీసులు వెల్లడించారు. స్థానిక పోలీసు ప్రతినిధి సల్తనత్ అజిర్బెక్ గురువారం ఈ విషయాన్ని ధ్రువీకరించారు. అంతకుముందు ఆందోళనకారులు.. నగరంలోని మేయర్ కార్యాలయం, అధ్యక్ష నివాసంతోపాటు ఇతర ప్రభుత్వ భవనాలపై జరిపిన దాడుల్లో ఎనిమిది మంది అధికారులు మృతి చెందారని, 317 మంది గాయపడినట్లు తెలిపారు.
మరోవైపు దేశంలో పెరుగుతున్న అశాంతిని అదుపులోకి తెచ్చేందుకు అదనపు భద్రతా బలగాలను సమకూర్చాలని కోరుతూ దేశాధ్యక్షుడు ఖాసిమ్ జోమార్ట్ టోకాయేవ్.. రష్యా నేతృత్వంలోని కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్(సీఎస్‌టీవో)కి విజ్ఞప్తి చేశారు. దీంతోపాటు నిరసనలు ఉద్ధృతంగా కొనసాగుతున్న అల్మాటీ, మాంగిస్టౌ ప్రావిన్స్ తదితర ప్రాంతాల్లో జనవరి 19 వరకు అత్యవసర పరిస్థితి విధించారు. ఇంటర్నెట్ సర్వీసులను నిలిపేశారు. ఇదిలా ఉండగా.. ఐరాస, యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు ఈ వ్యవహారంపై స్పందిస్తూ.. ఇరువర్గాలు సంయమనం పాటించాలని కోరారు. తమ నిరసనలను శాంతియుతంగా వ్యక్తపరిచేందుకు ప్రజలకు అనుమతివ్వాలని అమెరికా సూచించింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.