Assembly Elections: షెడ్యూల్‌ ప్రకారమే యూపీ అసెంబ్లీ ఎన్నికలు.. ఈసీ స్పష్టం

దేశంలో ఒమిక్రాన్‌ ఉద్ధృతి నేపథ్యంలో త్వరలో జరగబోయే ఉత్తరప్రదేశ్‌ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై సందిగ్ధత నెలకొన్ని వేళ కేంద్ర ఎన్నికల సంఘం నేడు

Updated : 30 Dec 2021 17:21 IST

వాయిదా వేయొద్దని రాజకీయ పార్టీలు కోరాయి: ఎన్నికల సంఘం

లఖ్‌నవూ: దేశంలో ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో త్వరలో జరగబోయే ఉత్తరప్రదేశ్‌ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై సందిగ్ధత నెలకొన్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టతనిచ్చింది. యూపీ అసెంబ్లీ ఎన్నికల వాయిదా ఉండదని, షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ సుశిల్‌ చంద్ర గురువారం వెల్లడించారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా పోలింగ్‌ ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు.

ఉత్తరప్రదేశ్‌ సహా ఉత్తరాఖండ్‌, మణిపుర్‌, గోవా, పంజాబ్‌ రాష్ట్రాలకు వచ్చే ఏడాది ఆరంభంలో శాసనసభ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే, గత కొన్ని రోజులుగా దేశంలో ఒమిక్రాన్‌ వ్యాప్తి పెరుగుతున్న దృష్ట్యా ఎన్నికలను వాయిదా వేయాలన్న డిమాండ్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇటీవల కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శితో సమావేశమైన ఈసీ.. రెండు రోజుల క్రితం ఉత్తరప్రదేశ్‌లోనూ పర్యటించింది. అక్కడ అన్ని రాజకీయ పార్టీల నేతలతో భేటీ అయ్యింది.  లఖ్‌నవూలో మీడియా సమావేశం నిర్వహించిన సీఈసీ సుశిల్‌ చంద్ర.. అసెంబ్లీ ఎన్నికలపై స్పష్టత నిచ్చారు.

‘‘యూపీ అసెంబ్లీ ఎన్నికలపై అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను విన్నాం. ఎన్నికలను వాయిదా వేయొద్దని పార్టీలు కోరాయి. అయితే, కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని తెలిపాయి. అందువల్ల ఉత్తరప్రదేశ్‌ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలను షెడ్యూల్‌ ప్రకారమే నిర్వహించాలని నిర్ణయించాం. స్వేచ్ఛాయుత వాతావరణంలో పోలింగ్‌ నిర్వహిస్తాం. తుది ఓటర్ల జాబితాను జనవరి 5, 2022న విడుదల చేస్తాం. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో వీవీప్యాట్లను ఏర్పాటు చేయనున్నాం. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా లైవ్‌ వెబ్‌కాస్టింగ్‌ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానున్నాం’ అని సుశిల్‌ చంద్ర వెల్లడించారు. 

ఓటింగ్‌ సమయంలో మార్పులు..

ఇక కరోనా దృష్ట్యా పోలింగ్‌ కేంద్రాల వద్ద థర్మల్‌ స్క్రీనింగ్‌, శానిటైజేషన్‌ ఏర్పాట్లు చేయనున్నట్లు ఆయన తెలిపారు. అంతేగాక, ఓటర్లు భౌతిక దూరం పాటించేలా పోలింగ్‌ సమయాన్ని కూడా గంట పెంచుతున్నట్లు చెప్పారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్‌కు అవకాశం కల్పిస్తున్నట్లు వివరించారు.

వ్యాక్సినేషన్‌ను పెంచండి..

ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి ఈసీ పలు సూచనలు చేసింది. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్‌ను మరింత వేగవంతం చేయాలని తెలిపింది. ఇక, కొవిడ్‌ బాధితుల కోసం ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు సుశిల్‌ చంద్ర తెలిపారు. ఈసీ తాజా ప్రకటనతో యూపీతో పాటు మిగిలిన నాలుగు రాష్ట్రాలకు షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు నిర్వహించే అవకాశముంది. గోవా, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, మణిపుర్‌ శాసనసభల పదవీ కాలాలు వచ్చే మార్చిలో ముగియనున్నాయి. యూపీ అసెంబ్లీ గడువు మే నెల వరకు ఉంది. ఈ ఐదు రాష్ట్రాలకు వచ్చే ఏడాది మార్చి - ఏప్రిల్‌లో ఎన్నికలు నిర్వహించాలని ఈసీ సన్నాహాలు చేస్తోంది. జనవరిలో షెడ్యూల్‌ ప్రకటించే అవకాశాలున్నాయి.

అప్పుడే మా పని మొదలు
ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. పార్టీలు ప్రచార సభలతో హోరెత్తిస్తున్నాయి. ఓ వైపు కరోనా, ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈసీ చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. దీనిపైనా ఈసీ స్పందించింది. అది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అని.. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన తర్వాతే తమ బాధ్యత మొదలవుతుందని వెల్లడించింది. ‘‘ప్రస్తుతం రాష్ట్రంలోని పరిస్థితులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. కేంద్రం సూచించిన కొవిడ్‌ మార్గదర్శకాలను అందరూ పాటించేలా ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలి. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలై.. ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాతే ఆ బాధ్యత మేం తీసుకుంటాం. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఆరోగ్యశాఖ అధికారులతో చర్చలు జరిపాం. రాష్ట్రంలో 50 శాతం ప్రజలకు వ్యాక్సినేషన్‌ పూర్తయిందని తెలిపారు. ఎన్నికల తేదీ ప్రకటన అనంతరం కొవిడ్‌ను దృష్టిలో ఉంచుకొని వివరంగా మార్గదర్శకాలను జారీ చేస్తాం’’ అని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ సుశీల్‌ చంద్ర వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని