Mulayam Singh Yadav: ములాయం సింగ్‌ యాదవ్‌ కన్నుమూత

సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు, ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్‌ యాదవ్‌ ఇకలేరు.

Updated : 10 Oct 2022 11:06 IST

లఖ్‌నవూ: సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు, ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్‌ యాదవ్‌(82) కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన..  పరిస్థితి విషమించడంతో ఈ ఉదయం గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు అఖిలేశ్ యాదవ్‌ వెల్లడించారు. ఆరోగ్య సమస్యల రీత్యా ఆగస్టు 22 నుంచి ములాయం ఆసుపత్రిలోనే ఉన్నారు. గతవారం ఆయన ఆరోగ్యం విషమించడంతో ఐసీయూకు తరలించారు. అప్పటి నుంచి ప్రాణాధార వ్యవస్థపై ఉన్న ఆయన.. సోమవారం ఉదయం కన్నుమూశారు.

1939 నవంబరు 22న ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఇటావా జిల్లా సైఫయి గ్రామంలో ములాయం జన్మించారు. చిన్నప్పటి నుంచే రాజకీయాలపై ఆసక్తి ఉన్న ఆయన.. 1967లో తొలిసారిగా యూపీ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఎమర్జెన్సీ సమయంలో 19 నెలల పాటు జైల్లో ఉన్నారు. 1989లో జనతాదళ్‌ పార్టీ నుంచి తొలిసారిగా యూపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 1992లో సమాజ్‌వాదీ పార్టీ పేరుతో సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించారు. తన రాజకీయ జీవితంలో మొత్తంగా 10 సార్లు ఎమ్మెల్యే, 7సార్లు లోక్‌సభ సభ్యుడిగా పనిచేశారు. మూడు సార్లు యూపీ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వంలో రక్షణశాఖ మంత్రిగానూ ఉన్నారు. ములాయం కుమారుడు అఖిలేశ్ యాదవ్‌ ప్రస్తుతం సమాజ్‌ వాదీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. 2012-17 మధ్య అఖిలేశ్ యాదవ్‌ యూపీ సీఎంగా వ్యవహరించారు.

ములాయం మృతి పట్ల యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మూడు రోజుల పాటు సంతాపదినాలు ప్రకటించారు. ములాయం అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన సైఫయిలో అధికారిక లాంఛనాలతో జరగనున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని