Atiq Ahmed: ఇప్పటివరకు రూ. 1400 కోట్ల ఆస్తుల స్వాధీనం.. ఇంకా ఎంత ఉందో?

ఉత్తర్‌ ప్రదేశ్‌(Uttar Pradesh)లో యోగి ప్రభుత్వం గ్యాంగ్‌స్టర్ అతీక్‌ అహ్మద్‌(Atiq Ahmed)పై ఉక్కుపాదం మోపింది. అతడి అనైతిక ఆర్థిక కార్యకలాపాలను సమూలంగా తుడిచిపెట్టేందుకు చర్యలు తీసుకుంటోంది.  

Updated : 16 Apr 2023 00:25 IST

లఖ్‌నవూ: గ్యాంగ్‌స్టర్ అతీక్‌ అహ్మద్‌(Atiq Ahmed) కుమారుడు అసద్‌ అహ్మద్ ఎన్‌కౌంటర్ ఉత్తర్‌ప్రదేశ్‌(Uttar Pradesh)లో సంచలనంగా మారింది. ‘మిట్టీ మే మిలా దేంగే(మట్టిలో కలిపేస్తా) అంటూ అసెంబ్లీ వేదికగా తాను అన్న మాటలను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ నిజం చేస్తూ.. అతీక్‌ గ్యాంగ్‌ నేర సామ్రాజ్యాన్ని కూల్చివేస్తున్నారు. అలాగే ఆర్థిక మూలాలను పెకిలించివేస్తున్నారు. అతీక్‌, అతడి అనుచరులకు చెందిన అక్రమాస్తుల్లో ఇప్పటివరకు రూ.1400 కోట్ల విలువైన ఆస్తులను  స్వాధీనం చేసుకున్నట్లు యూపీ అధికారులు వెల్లడించారు. ఈ ఆస్తులన్నింటినీ నేర చర్యల ద్వారానే సంపాదించినట్లు వెల్లడించారు. 

ఇదీ చదవండి: నాడు యోగి మాటిచ్చారు.. నేడు మట్టిలో కలిపేశారు..!

‘గత 50 రోజుల్లో అతీక్‌ అహ్మద్‌(Atiq Ahmed)నేర సామ్రాజ్యంతో పాటు ఆర్థిక మూలాలను ధ్వంసం చేశాం. ఇది అతడికి చావు దెబ్బ. అతడి సోదరుడు అష్రఫ్‌ అహ్మద్‌ జైల్లోనే ఉన్నాడు. ఇప్పటికే అతడి ఇద్దరు కుమారులు జైల్లో ఉన్నారు. మూడో కుమారుడు అసద్‌ చనిపోయాడు. మరో ఇద్దరు మైనర్ కుమారులు జువినైల్ హోంలో ఉండగా.. అతడి భార్య షైస్టా పర్వీన్ పరారీలో ఉంది’ అని ఓ అధికారి తెలిపారు. రూ.1400 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అలాగే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు చెందిన 15 బృందాలు మరో రూ.108 కోట్ల నల్లధనాన్ని గుర్తించాయి. ఆ సోదాల్లో 50 డొల్ల సంస్థలను గుర్తించగా.. అవి దోపిడీలతో సంపాదించిన సొమ్మును వైట్ మనీగా మార్చుతున్నట్లు తెలిసిందన్నారు. సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఇదిలా ఉంటే.. అతీక్‌ అహ్మద్‌పై 1979లో మొదటి కేసు నమోదు కాగా.. 100కు పైగా క్రిమినల్‌ కేసుల్లో అతడు నిందితుడిగా ఉన్నాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని