Mask must: కొవిడ్‌ కేసులు మళ్లీ పెరుగుతున్నాయ్‌.. మాస్కులు ధరించాల్సిందే!

దేశంలో కొవిడ్‌ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. గత కొన్ని రోజులుగా వెయ్యిలోపే నమోదైన కొవిడ్‌ కేసుల సంఖ్య ఆదివారం ఒక్కసారిగా......

Updated : 18 Apr 2022 18:45 IST

యూపీ ప్రభుత్వం కీలక ఆదేశం

లఖ్‌నవూ: దేశంలో కొవిడ్‌ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. గత కొన్ని రోజులుగా వెయ్యిలోపే నమోదైన కొవిడ్‌ కేసుల సంఖ్య ఆదివారం ఒక్కసారిగా 2000 మార్కును దాటడం, 200లకు పైగా మరణాలు సంభవించడం కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత కొంతకాలంగా కేసులు తగ్గముఖం పట్టడంతో మాస్క్‌ ధరించడం తప్పనిసరి నిబంధనల్ని సడలించిన యూపీ సర్కార్‌.. తాజాగా కేసులు పెరుగుతుండటంతో అప్రమత్తమైంది. లఖ్‌నవూతో పాటు దేశ రాజధాని పరివాహక ప్రాంతం (ఎన్‌సీఆర్‌) పరిధిలోని ఆరు జిల్లాల్లో బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాల్సిందేనని ఆదేశించింది. కొత్త కేసుల పెరుగుదల పలు ప్రాంతాలపై ప్రభావం చూపడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ అధికార ప్రతినిధి తెలిపారు. 

లఖ్‌నవూతో పాటు గౌతమ్‌బుద్ధ నగర్‌, ఘజియాబాద్‌, హాపూర్‌, మీరట్‌, బులంద్‌షార్‌, బాగ్పాట్‌ జిల్లాల్లో ఈ నిబంధన అమలులో ఉంటుందన్నారు. నిన్న గౌతమ్‌బుద్ధనగర్‌లో 65 కొత్త కేసులు రాగా.. ఘజియాబాద్‌లో 20, లఖ్‌నవూలో 10 చొప్పున వెలుగుచూడగా.. కొవిడ్‌తో నెలకొన్న పరిస్థితిని సునిశితంగా పరిశీలించాని సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఆదేశించినట్టు పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ఆదివారం 2.6లక్షల మందికి కొవిడ్‌ పరీక్షలు చేయగా.. 2183 మందికి కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అత్యధికంగా కేరళలో 940 కేసులు రాగా.. దిల్లీలో 517 కేసులు బయటపడ్డాయి. మరోవైపు 24గంటల వ్యవధిలో 214 కొవిడ్‌ మరణాలు నమోదవ్వగా.. అందులో కేరళ నుంచే 213 మరణాలు రాగా.. యూపీలో ఒక మరణం నమోదు కావడం గమనార్హం.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని