Yogi Adityanath: యోగి ప్రమాణస్వీకారానికి భారీ ఏర్పాట్లు.. ముఖ్య అతిథులు వీరే!

ఉత్తర్‌ప్రదేశ్‌లో మరోసారి భాజపా ప్రభుత్వం కొలువుదీరనుంది. ఈనెల 25వ తేదీన ముఖ్యమంత్రితోపాటు మంత్రుల ప్రమాణస్వీకారానికి భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి......

Published : 20 Mar 2022 01:42 IST

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లో మరోసారి భాజపా ప్రభుత్వం కొలువుదీరనుంది. ఈనెల 25వ తేదీన ముఖ్యమంత్రితోపాటు మంత్రుల ప్రమాణస్వీకారానికి భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి సహా పలువురు కేంద్ర మంత్రులు హాజరు కానున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే లఖ్‌నవూలోని అటల్‌ బిహారీ వాజ్‌పాయీ ఏక్నా మైదానంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. 75వేల సీటింగ్‌ కెపాసిటీని సిద్ధం చేస్తున్నారు. అడిషనల్‌ చీఫ్‌ సెక్రెటరీ నవీన్‌ సెహ్‌గల్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. చీఫ్‌ సెక్రెటరీ డీఎస్‌ మిశ్రా ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తికావచ్చినట్లు తెలిపారు. ‘ప్రమాణ స్వీకారోత్సవంలో 75 వేల మంది కూర్చునే ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రాండ్‌గా జరగబోయే ఈ కార్యక్రమం కోసం సన్నాహాలు జరుగుతున్నాయి’ అని సెహ్‌గల్‌ పేర్కొన్నారు.

యూపీ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్‌ ప్రమాణం చేయబోయే ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా రాబోతున్నారని భాజపా వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. ఆయనతోపాటు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా మరికొందరు కేంద్ర మంత్రులు హాజరుకానున్నట్లు సమాచారం. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు.

25వ తేదీన సాయంత్రం 4 గంటలకు యోగి వరుసగా రెండోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. కొత్త మంత్రివర్గంలో 20 మందికి పైగా కేబినెట్‌ హోదా మంత్రులు ఉంటారని, దాదాపుగా అదే సంఖ్యలో స్వతంత్ర, సహాయ హోదా అమాత్యులు ఉంటారని తెలుస్తోంది. ఇటీవల జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా భారీ విజయంతో వరుసగా రెండోసారి అధికార పీఠం దక్కించుకున్న విషయం తెలిసిందే. మొత్తం 403 స్థానాలకు గాను భాజపా 255 సీట్లు సాధించింది. దాని మిత్రపక్షాలు 18 స్థానాల్లో గెలుపొందాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని