UP: పిల్లిని దొంగిలించాడని.. 30 పావురాలకు విషమిచ్చి చంపిన వ్యక్తి

తన పిల్లి కనిపించడంలేదని పక్కింటి వ్యక్తికి చెందిన పావురాలను ఓ వ్యక్తి విషం పెట్టి చంపాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. 

Published : 21 Jan 2023 01:05 IST

యూపీ: తను పెంచుకుంటున్న పిల్లిని దొంగిలించాడనే నెపంతో ఓ వ్యక్తి అమానుష చర్యకు పాల్పడ్డాడు. తన పొరుగింటి వ్యక్తి ఎన్నో ఏళ్ల నుంచి అపురూపంగా పెంచుకుంటున్న 30 పావురాల(Pigeons)కు విషమిచ్చి చంపాడు. ఈ హృదయ విదారక సంఘటన ఉత్తరప్రదేశ్‌(UP)లో చోటుచేసుకుంది. దీంతో పక్షులను చంపిన నేరం కింద పోలీసులు నిందితుడిపై ఐపీసీ సెక్షన్‌ 428 కింద కేసు నమోదు చేశారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూపీలోని షహంజపుర్‌ జిల్లా పరిధిలో అబిద్‌ అనే వ్యక్తి కొన్నేళ్ల నుంచి పిల్లిని పెంచుకుంటున్నాడు. అయితే కొన్నిరోజుల నుంచి ఆ పిల్లి కనిపించడం లేదు. దీంతో తన పొరుగునే ఉంటున్న పక్షి ప్రేమికుడు వారిస్‌ అలీపై అనుమానం పెంచుకున్నాడు. తనే తన పిల్లిని ఎత్తుకెళ్లి ఉంటాడని, దాన్ని చంపేసి ఉంటాడని కోపంతో కక్ష పెంచుకున్నాడు. దీంతో అలీ ప్రేమగా పెంచుకుంటున్న పావురాలను చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈక్రమంలో పావురాలకు వేసే గింజల్లో కొన్ని విషపదార్థాలు కలిపి చల్లాడు. ఆ విషపదార్థాలను తిన్న పావురాలు మృత్యువాత పడ్డాయి. మొత్తం 78 పావురాల్లో 30 చనిపోయాయి. పలు పావురాలు అనారోగ్యానికి గురయ్యాయి. చనిపోయిన పావురాల్లో అరుదైన జాతులకు చెందినవి సైతం ఉన్నాయి. అలీ ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు ముగ్గురు వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. చనిపోయిన పావురాలను శవపరీక్ష కోసం పంపినట్లు జిల్లా ఏఎస్పీ సంజయ్‌ కుమార్‌ తెలిపారు. అయితే చనిపోయిందనుకున్న పిల్లి నిందితుడి వద్దకు తిరిగి రావడం గమనార్హం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు