Corona Virus: చైనా నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌

చైనా నుంచి ఆగ్రా వచ్చిన 40 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలింది. అతడి నుంచి సేకరించిన నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం లఖ్‌నవూ పంపించారు.

Published : 26 Dec 2022 00:38 IST

ఆగ్రా: రెండు రోజుల క్రితం చైనా (China) నుంచి ఆగ్రా (Agra) వచ్చిన 40 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్‌ (Corona Positive)గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం అతడిని ఇంట్లోనే క్వారంటైన్‌ చేసినట్లు చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ అరుణ్‌ శ్రీవాస్తవ తెలిపారు. చైనాలో వైరస్‌ వ్యాప్తి ఉద్ధృతంగా ఉన్న తరుణంలో అక్కడి నుంచి వచ్చిన వ్యక్తికి పాజిటివ్‌గా తేలడం స్థానికంగా కలకలం రేపింది. బాధితుడి నుంచి సేకరించిన నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం లఖ్‌నవూ పంపినట్లు అధికారులు చెప్పారు. అంతేకాకుండా ఆ వ్యక్తి కుటుంబ సభ్యులకు కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు శ్రీవాస్తవ వెల్లడించారు.. బాధిత వ్యక్తి డిసెంబరు 23న చైనా నుంచి దిల్లీ మీదుగా ఆగ్రా చేరుకున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ల్యాబ్‌లో పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. నవంబరు 25 తర్వాత ఆగ్రా జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసు నమోదు కావడం ఇదే తొలిసారి.

తాజా పరిణామంతో ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. తాజ్‌మహల్‌, ఆగ్రాకోట సందర్శనకు వచ్చే విదేశీయుల నమూనాలను సైతం సేకరిస్తున్నారు. అంతేకాకుండా ఆగ్రా విమానాశ్రయం, రైల్వేస్టేషన్‌, ఇంటర్‌ బస్‌ టెర్మినల్‌లలో ఇవాళ్టి నుంచి నమూనాల సేకరణను ప్రారంభించారు. జనసమూహాలు ఎక్కుగా ఉండేచోట ప్రజలు కచ్చితంగా మాస్కు ధరించాలని, భౌతికదూరం పాటించాలని సీఎంవో ఆదేశాలు జారీ చేసింది. కరోనా వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను కోరింది.

చైనాతోపాటు వివిధ దేశాల్లో కరోనా ఉద్ధృతంగా వ్యాపిస్తున్న తరుణంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా నిబంధనలను అమలు చేయాలని రాష్ట్రాలకు సూచించింది. అంతేకాకుండా వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్న చైనా, జపాన్‌, దక్షిణ కొరియా, సింగపూర్‌, థాయ్‌లాండ్‌ దేశాల నుంచి వచ్చే వారికి ఆర్‌టీ-పీసీఆర్‌ టెస్టులను తప్పనిసరి చేసింది. ఒకవేళ భారత్‌లోనూ వైరస్‌ వ్యాప్తి మొదలైతే ఎంతమేర సిద్ధంగా ఉన్నామో తెలుసుకునేందుకు మంగళవారం మాక్‌ డ్రిల్‌ను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. ఆస్పత్రుల్లో ఐసీయూ పడకలు, ఆక్సిజన్‌ సిలిండర్లను అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని